Share News

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:06 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కేసు నమోదైంది. స్థానిక శ్రీరామ్‌సేన ధర్మార్థ సేవా సమితి సభ్యుడు, వాల్మీకి (ఎస్సీ) సామాజిక వర్గానికి చెందిన అమిత్‌ కుమార్‌...

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌

  • కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు

  • చేశారంటూ ‘శ్రీరామ్‌సేన’ సభ్యుడి ఫిర్యాదు

  • పలు అభియోగాలతో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు

  • కేసులు నా ఛాతీపై పతకాల వంటివి: రాహుల్‌

  • ఖర్గేను అవమానించిందే గాంధీ కుటుంబం: బీజేపీ

హల్ద్వానీ, ఆగస్టు 31: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కేసు నమోదైంది. స్థానిక శ్రీరామ్‌సేన ధర్మార్థ సేవా సమితి సభ్యుడు, వాల్మీకి (ఎస్సీ) సామాజిక వర్గానికి చెందిన అమిత్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే పాల్గొన్న కార్యక్రమ సభా వేదికను శుద్ధి చేసిన విషయంలో రాజకీయ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపైౖ ఇటీవల రాహుల్‌ మాట్లాడుతూ.. ఖర్గే పాల్గొన్న సభా వేదికను శుద్ధి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఖర్గే దళితుడు అయినందువల్లే బీజేపీ-శ్రీరామ్‌సేన అనుచితంగా ప్రవర్తించిందన్నారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలు తమ సామాజిక వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయంటూ ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆ వేదికను శుభ్రపరిచే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు తాము పాల్గొన్నామని.. ఖర్గే కులానికి, ఆ శుద్ధి కార్యక్రమానికి ఏ సంబంధం లేకపోయినా కులం రంగు పులమడానికి ప్రయత్నించారన్నారు. ఈ మేరకు రాహుల్‌పై కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే అభియోగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాహుల్‌ స్పందించారు. తనపై కేసులు ఛాతీపై పతకాల వంటివని అభివర్ణించారు. మరోవైపు, ఖర్గేను అవమానించిందే గాంధీ కుటుంబమని.. దేశంలో అత్యంత దళిత వ్యతిరేక నాయకుడు రాహులేనని బీజేపీ మండిపడింది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 06:06 AM