విద్యార్థులకు మేమున్నాం..
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:45 AM
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రతిపక్షం తీవ్రతరం చేసింది. దేశంలో విద్యార్థులు ఒంటరి వాళ్లు కాదని, ప్రతిపక్షమంతా విద్యార్థులకు అండగా ఉందని...
ప్రతిపక్షమంతా వారి వెంటే..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాసట
విద్యార్థులకు మద్దతుగా గాంధీ
స్మృతివనంలో విపక్ష ఎంపీల ప్రదర్శన
మోదీ.. యువత విజయాలను
మీ ఖాతాలో వేసుకుంటారు
వారిపై దాడికి బాధ్యత తీసుకోరా?
ప్రధానిపై ధ్వజమెత్తిన ప్రియాంక
న్యూఢిల్లీ, జూలై 23: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై పోరాటాన్ని ప్రతిపక్షం తీవ్రతరం చేసింది. దేశంలో విద్యార్థులు ఒంటరి వాళ్లు కాదని, ప్రతిపక్షమంతా విద్యార్థులకు అండగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, ఇండియా కూటమికి చెందిన ఎంపీలంతా ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. తెలుపు రంగు టీషర్ట్ ధరించిన రాహుల్ గాంధీ.. జాతీయ జెండా, రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకొని ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మిగిలిన ఎంపీలంతా కొవ్వొత్తుల ప్రదర్శనను తలపించేలా తమ సెల్‌ఫోనుల్లోని టార్చ్‌లైట్లను ఆన్ చేసి చూపించారు. నిజానికి ప్రతిపక్ష ఎంపీలంతా గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. ఆ వెంటనే పోలీసులు రాహుల్ ఇంటి చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తామంతా గాంధీ స్మృతి వనానికి వెళుతున్నామని ఆ సమావేశం అనంతరం రాహుల్ హఠాత్తుగా ప్రకటించారు. రాహుల్ గాంధీ ఇంటి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న గాంధీ స్మృతివనానికి ఎంపీలంతా మూడు బస్సుల్లో బయలుదేరారు. ఈ ప్రయత్నాన్ని తొలుత అడ్డుకున్న పోలీసులు తర్వాత అనుమతించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను స్మరించుకునేందుకు, జంతర్‌మంతర్ వద్ద జరిగిన అల్లర్లలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఈ ప్రదర్శన చేపట్టినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే, దేశంలోని విద్యార్థులు ఒంటరి వాళ్లు కాదని, ప్రతిపక్షమంతా విద్యార్థులకు అండగా ఉందని, వారి డిమాండ్లకు మద్దుతు పలుకుతోందని రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక యువత ఏ విజయం సాధించినా తన ఖాతాలో వేసుకునే ప్రధాని.. విద్యార్థులపై దాడులకు కూడా బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు.
గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను తాను ఎంతో ప్రేమగా చూసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రధాని.. వారిపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి ఎలా చేయించారని ప్రశ్నించారు. ‘‘అధికార పక్షానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ వెలుపల నిలబడి ఆందోళన చేయడం ఎప్పుడైనా చూశామా? పార్లమెంట్ సమయాన్ని వృథా చేస్తున్నారు. మనం అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఇంటర్నెట్ ఆపేస్తున్నారు. వాళ్లేమీ ఉగ్రవాదులు కాదు. క్రీడల్లో పతకాలు సాధిస్తే.. తన వల్లే వచ్చిందని మోదీ చెప్పుకొంటారు. అంగారకుడిపైకి వెళ్లినా, రాకెట్లు ప్రయోగించినా వాటినీ తన ఖాతాలోనే వేసేసుకుంటారు. ఆయన హయాంలో దాదాపు 152 పేపర్ లీకేజీలు జరిగాయి. వాటికి బాధ్యులెవరు? ప్రస్తుతం విద్యార్థులపై జరుగుతున్న దాడులకు బాధ్యులెవరు? విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న మోదీ.. వీటికి కూడా బాధ్యత వహించాలి’’ అని ప్రియాంక డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గురువారం రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఎలాంటి చర్చ జరిపినా వ్యర్థమేనన్నారు. ఎక్స్‌లోనూ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. చాలా ఆలస్యంగా, చాలా చిన్న చర్య తీసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అహంకారంతో పనిచేస్తోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ విమర్శించారు. విద్యార్థుల ఆందోళనలపై ఉక్కుపాదం మోపడం వల్ల ప్రయోజనం ఉండదని, తక్షణమే తప్పు ఒప్పుకొని చర్చలు ప్రారంభించాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు