రాహుల్‌పై విచారణను నిలిపివేయండి
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:18 AM
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఈ అంశంలో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను...
అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈడీ, సీబీఐ నివేదిక అవసరం లేదని స్పష్టీకరణ
హైకోర్టు తీరు సహజ న్యాయసూత్రాలకు
వ్యతిరేకంగా ఉందని ఆక్షేపణ
ఆదాయానికి మించిన ఆస్తుల అంశంలో
కాంగ్రెస్ నేతకు ఊరట
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఈ అంశంలో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణను నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టు (లఖ్‌నవ్ బెంచ్)ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ, ఈడీలు అలహాబాద్ హైకోర్టుకు ఎలాంటి నివేదిక సమర్పించొద్దని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేశ్ శిశిర్‌తోపాటు సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. రాహుల్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల విషయం అంత తీవ్రమైనది అయితే దర్యాప్తు సంస్థలు మౌనంగా ఎందుకు ఉన్నాయి? అని సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏదైనా కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు సొంతంగా చర్యలు చేపట్టొచ్చని, కోర్టు ఆదేశాల కోసం ఎందుకు నిరీక్షించాయని నిలదీసింది. అలాగే, రాహుల్ వాదనలు వినకుండా అలాహాబాద్ హైకోర్టు ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేశ్ పిటిషన్ ఆధారంగా.. రాహుల్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీబీఐ, ఈడీలకు అలహాబాద్ హైకోర్టు మే 12న ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా