రాఘవ లారెన్స్ యూ టర్న్!
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:18 AM
ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ యూ టర్న్ తీసుకున్నారు. సినీ హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) తరఫున తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో...
టీవీకే తరఫున తిరుచ్చి ఈస్ట్‌లో పోటీకి విముఖత
చెన్నై, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ యూ టర్న్ తీసుకున్నారు. సినీ హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) తరఫున తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. టీవీకేలో యేళ్లతరబడి పార్టీకోసం తీవ్రంగా పాటుపడినవారు ఎంతో మంది ఉన్నారని, వారిలో ఒకరిని తిరుచ్చి నియోజకవర్గంలో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ నిలబెడతారని తెలిపారు. విజయ్ సినీ హీరోగా ఉన్నప్పుడు ఆయన కోసం గోడలపై పోస్టర్లు అతికించినవారు, రాజకీయ ప్రవేశం తర్వాత ఆ పార్టీ కోసం కష్టపడ్డవారు ఎంతో మంది ఉన్నారని, వారిలో ఒకరిని పోటీకి పెట్టాలా? లేక తాను పోటీ చేయాలా? అనే దానిపై విజయ్ నిర్ణయం తీసుకుంటారని లారెన్స్ తెలిపారు. ఇప్పుడు పోటీ చేయకుంటే తాను రాజకీయాల్లోకి రానట్లు కాదని, ఆచితూచి వ్యహరించి రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పారు. తిరుచ్చి ఈస్ట్‌లో నిలబడనని మాత్రమే తాను చెబుతున్నానని, ఇతర నియోజకవర్గాలలో పోటీ చేయబోనని చెప్పడంలేదని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. సులభంగా వస్తుంది కదా అని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా పదవి చేపట్టి సుఖపడేందుకు తాను రాజకీయాల్లోకి రావటం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాఘవ లారెన్స్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!