Share News

పేపర్‌ లీక్‌ నిందితులకు కఠిన శిక్షలు!

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:12 AM

ప్రశ్నపత్రాల లీక్‌ తదితర అక్రమాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా సంబంధిత చట్టాన్ని సవరించే బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ‘పబ్లిక్‌ పరీక్షల...

పేపర్‌ లీక్‌ నిందితులకు కఠిన శిక్షలు!

5-10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.50 లక్షల జరిమానా.. వ్యవస్థీకృత నేరాలకు రూ.10 కోట్ల ఫైన్‌

  • లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రాల లీక్‌ తదితర అక్రమాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా సంబంధిత చట్టాన్ని సవరించే బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ‘పబ్లిక్‌ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ పేరిట రూపొందించిన ఈ బిల్లును కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. పేపర్‌ లీకులకు పాల్పడే వారికి కనీసం ఐదేళ్లు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కనిష్ఠంగా ఏడేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. కాగా, ఈ అక్రమాలపై దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. చార్జిషీటు దాఖలైన 3 నెలల్లో విచారణ పూర్తి చేయటానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో కేంద్రప్రభుత్వం పేపర్‌ లీక్‌ ఘటనల మీద దర్యాప్తు చేయించటానికి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయటానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.

వరుస వాయిదాలు

సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. విద్యార్థుల మీద ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో దారుణంగా లాఠీచార్జి, పెల్లెట్ల వర్షం, ఏకే 47తో కాల్పులు జరపటంపై కేంద్ర హోమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలంటూ డిమాండ్‌ చేశారు. విపక్ష ఎంపీల నినాదాల మధ్యనే పరీక్షల బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ కోసం స్పీకర్‌ అభ్యర్థించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పేపర్‌ లీక్‌ నిరోధక బిల్లుపై చర్చకు ఆరు గంటల సమయం కేటాయించినట్లు ఓం బిర్లా తెలిపారు. కాగా, మంగళవారం పేపర్‌లీక్‌ నిరోధక బిల్లుపై చర్చ జరుగుతుందని, స్పీకర్‌ వివిధ పార్టీల సభాపక్ష నేతలతో మాట్లాడి ఒప్పించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో కూడా ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌ను వాయిదా వేసి.. విద్యార్థులపై జరిపిన లాఠీచార్జి మీద చర్చ జరపాల్సిందేనని విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జి, పెల్లెట్‌గన్స్‌, టియర్‌గ్యాస్‌ ప్రయోగం వంటి చర్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బాధ్యత వహించాలన్నారు. నిరసనల్లో పాల్గొన్నందుకు యువతను అరెస్టు చేస్తున్నారని, భయకంపితుడైన నియంత పాలనకు ఇది నిదర్శమన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 06:12 AM