నిరసన పేరుతో స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించలేరు
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:40 AM
నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నా, ఆ పేరుతో ఏ స్థలాన్నీ నిరవధికంగా ఆక్రమించుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
ఢిల్లీలో గత నెల ఆందోళనలపై
సుప్రీం కోర్టు అభ్యంతరం
న్యూఢిల్లీ, నవంబరు 3: నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నా, ఆ పేరుతో ఏ స్థలాన్నీ నిరవధికంగా ఆక్రమించుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల కోసం నిర్దేశించిన ప్రాంతాలకు సైతం నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని అభిప్రాయపడింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబరులో ఢిల్లీలో జరిగినఆందోళనలకు సంబంధించిన పిటిషన్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘‘ఒక స్థలాన్ని ఎల్లకాలం ఆక్రమించుకోలేరు. ఇతర నిరసనకారులూ ఉన్నారు. అందరికీ నిరసన హక్కు ఉంది’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. రైతులు, కార్మికులు, కార్మిక సంఘాలు, నిరాశ్రయులు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. నిరసనలకు ఇచ్చే అనుమతి ఉత్తర్వుల్లో షరతులు స్పష్టంగా ఉండాలని కూడా సూచించారు. నిరసన హక్కు, వ్యాపార హక్కు రెండూ రాజ్యాంగం గుర్తించినవేనని సీజేఐ అన్నారు. ఇక్కడ వ్యాపారమంటే దుకాణాలే కాదని, రోజు కూలీ బతుకు దెరువు కూడా అని గుర్తు చేశారు. అనుమతిని ఇచ్చినా, నిరాకరించినా అందుకు కారణాలతో ఉత్తర్వు ఉండాలని, నిరసనలను పూర్తిగా అడ్డుకోజాలరని ధర్మాసనం తెలిపింది.
రూ.2 వేల కోట్ల నష్టం
ఢిల్లీ వ్యాపార సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నిరసనల వల్ల రూ.2 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. రామ్‌లీలా మైదాన్‌కు మైలు దూరంలోనే హోల్‌సేల్ మార్కెట్లు ఉన్నాయని, కనీసం 50 లక్షల మంది అక్కడ నివసిస్తున్నారని తెలిపారు. నిరసనలు కొనసాగితే దీపావళిఅమ్మకాలూ దెబ్బతింటాయని అన్నారు. రెండు నెలల పాటు నిరసనలు, ధర్నాలు జరగకుండా చూడాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు నోటీసులు జారీ చేసింది. నిరసనల నిర్వాహకుల వాదన వినకుండా వ్యాపారుల ఫిర్యాదును పూర్తి స్థాయిలో తేల్చలేమని, వారిని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించింది. అయితే అమ్మకాలు తగ్గడానికి నిరసనలే కారణమని చెప్పగలమా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్థిక పరిస్థితి, రోడ్లపై బారికేడ్లు కూడా ప్రభావం చూపి ఉండవచ్చని, ప్రభుత్వమే దుకాణాలను మూయిస్తే ఏమిటని ప్రశ్నించింది.
పార్లమెంటుకు మార్చ్ కుదరదు: కేంద్రం
జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకు ఒక్క రోజే అనుమతి ఇవ్వగా, 17 రోజులు అక్కడే ఉన్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అనుమతి లేకుండా పార్లమెంటు వైపు కదిలారని గుర్తు చేశారు. పార్లమెంటు దేశ సార్వభమత్వానికి చిహ్నమని అన్నారు. జంతర్ మంతర్ పబ్లిక్ రోడ్డు అని, దాన్ని నిరవధికంగా ఆక్రమించలేరని వాదించారు. బంద్ పిలుపు ఇచ్చినవారే పర్యవసానాలకు బాధ్యత వహించాలని కోరారు. జంతర్ మంతర్‌ను తరలించారని, ఇప్పుడు రామ్‌లీలా మైదాన్ పైనా అభ్యంతరాలు చెబితే ప్రజలు ఎక్కడ నిరసన తెలపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హరిహరన్ ప్రశ్నించారు. జంతర్ మంతర్‌లో హింసకు ఢిల్లీ పోలీసులే కారణమని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ఆరోపించారు. సుమారు 7 వేల మందిని నిర్బంధించారని ప్రస్తావించారు. వారిని అక్కడి నుంచి తరలించామే తప్ప నిర్బంధించలేదని మెహతా బదులిచ్చారు
లైంగిక వేధింపుల కేసు
23కు వాయిదా
మహిళా జర్నలిస్టులపై లైంగిక హింస ఆరోపణలపై సిట్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నవంబరు 23కు వాయిదా వేసింది. పిటిషన్లలోని అంశాలను తొమ్మిది విభాగాలుగా గుర్తించి, వాదనల క్రమం, సమయం తెలపాలని పక్షాలను ఆదేశించింది. పూర్తిగా కొత్త అంశాలు ఉంటేనే తాజా పిటిషన్లు నమోదు చేయాలని రిజిస్ట్రీకి సూచించింది. విచారణలో న్యాయవాదులు పరస్పరం అడ్డు తగలడంతో, కోర్టును చేపల మార్కెట్‌లా మారుస్తున్నారెందుకని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్ విస్తరణ
రిలయన్స్ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్