Share News

రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన..

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:31 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు నార్త్ బెంగాల్‌లో అంతర్జాతీయ సంతాలి సదస్సును ప్రారంభించారు. అయితే తన పర్యటనలో పలు ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన..
Droupadi murmu

కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శనివారం నాడు నార్త్ బెంగాల్‌లో అంతర్జాతీయ సంతాలి సదస్సును ప్రారంభించారు. అయితే తన పర్యటనలో పలు ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా కారణాల పేరుతో బిధాన్‌నగర్‌లో జరగాల్సిన సదస్సు వేదకను బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని గోసాయిపూర్‌కు మార్చడం, వేదక చిన్నది కావడంతో గిరిజన కమ్యూనిటీకి చెందిన వారు పెద్దసంఖ్యలో రాలేకపోవడం వంటివి చోటుచేసుకున్నాయి. విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాకుండా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆమె మంత్రులు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రపతికి సిలిగురి మేయర్ దేవ్ స్వాగతం పలికారు.


నేనూ బెంగాల్ కూతుర్నే..

సభావేదిక మార్పుపై ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ఇక్కడకు రావడం చాలా ఈజీగానే వచ్చానని, అయితే జనసమ్మర్ధం ఎక్కువగా ఉంటుందనే కారణంగా వేదికను మార్చినట్టు అధికార యంత్రాంగం చెప్పిందని తెలిపారు. 'రాష్ట్రపతి వచ్చి జనసమర్ధం లేని చోట ఈవెంట్‌లో పాల్గొని వెళ్లిపోతారని వారు అనుకుని ఉంటారు. వాళ్ల ఆలోచన ఏమిటో నాకు తెలియదు. ఈ పరిణామం చాలా బాధాకరంగా ఉంది' అని అన్నారు.


సీఎంకు నాపై కోపమేమో..

రాష్ట్రపతి తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినప్పటికీ సీఎం విషయంలో ఆచితూచి మాట్లాడారు. మమతా బెనర్జీ తన చిన్న చెల్లెలని, తాను కూడా బెంగాల్ కూతుర్నేనని అన్నారు. ఏదో కారణం వల్ల ఆమెకు (మమతా బెనర్జీ) తనపై కోపం వచ్చి ఉండవచ్చని అన్నారు. ఆమెపై తానెలాంటి కంప్లయింట్ చేయదలచుకోలేదని చెప్పారు. అందరూ బాగుండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. నార్త్ బెంగాల్‌లో ఆదివాసీలు, గోర్ఖాలు, రాజ్‌బన్షీలు, బెంగాలీలు కలిసిమెలసి ప్రశాంతంగా జీవిస్తుండటం, సామాజిక సామరస్యం చాటుకోవడంపై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి తన పర్యటన సందర్భంగా స్థానిక గిరిజనులతో సంభాషించారు.


మమతా బెనర్జీపై బీజేపీ విమర్శలు

ద్రౌపది ముర్ము రాక సందర్భంగా రాష్ట్రపతి కార్యాలయానికి ఉన్న గౌరవాన్ని మమతా బెనర్జీ దిగజార్చారని బీజేపీ మండిపడింది. ఇది టీఎంసీ ప్రభుత్వ నిర్వహణా వైఫల్యాన్ని చాటుతుందని పార్టీ నేత అమిత్ మాలవీయ అన్నారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా

Updated Date - Mar 07 , 2026 | 09:21 PM