Share News

ఓటమి ఎదురైనా.. తిరిగి యాత్రబాట పట్టిన ప్రశాంత్ కిషోర్

ABN , Publish Date - Feb 08 , 2026 | 09:19 PM

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి యాత్ర బాట పట్టారు. పశ్చిమ చంపరాణ్ జిల్లా నుంచి 'బిహార్ నవనిర్మాణ్ యాత్ర'ను ఆదివారంనాడు ప్రారంభించారు.

ఓటమి ఎదురైనా.. తిరిగి యాత్రబాట పట్టిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor

బేతియా: జన్ సురాజ్ (Jan Suraaj) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) మరోసారి యాత్ర బాట పట్టారు. పశ్చిమ చంపరాణ్ జిల్లా నుంచి 'బిహార్ నవనిర్మాణ్ యాత్ర' (Bihar Navnirman Yatra)ను ఆదివారంనాడు ప్రారంభించారు. తమ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మించి, పటిష్టం చేయడంపై దృష్టిసారిస్తామని తెలిపారు.


జన్‌సురాజ్ పార్టీ 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీలోకి దిగింది. మొత్తం 238 సీట్లలో పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా సాధించలేక పోయింది. అధికార ఎన్డీయే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికలకు ముందు పథకాల పేరుతో ఒక్కో మహిళకు రూ.10,000 చొప్పున ఇవ్వడం ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందని పీకే ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు చెల్లవంటూ ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కొట్టివేసింది.


పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి

బిహార్ నవనిర్మాణ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ ఆదివారంనాడిక్కడ ప్రారంభిస్తూ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆర్గనైజేషన్‌ పునర్నిర్మాణం, పటిష్టత దిశగా యాత్ర సాగిస్తామని, రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ, జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలకు జనసురాజ్ ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజలకు చేరవేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా తమ పార్టీ చురుకుగా ఉందని, జిల్లాల్లో అట్టడుగు స్థాయి ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేసి పార్టీని మరింత విస్తరించేందుకు ఈయాత్ర ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. బిహార్ నవనిర్మాణ్ అభియాన్ సాకారమయ్యేందుకు ప్రతి జిల్లాలోనూ కొంత సమయం ఉంటానని, పాత భాగస్వాములను, కొత్తగా చేరాలనుకునే వారిని కలుసుకుని పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తానని వివరించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ద్వారా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి, రూ. రూ.10,000 మాత్రమే చెల్లించి చేతులు దులుపేసుకుందని ఆరోపించారు. తమ యాత్రలో లబ్ధిదారులందరినీ కలుసుకుంటామని, మహిళలందరికీ ప్రభుత్వం ప్రకటించిన మొత్తం ప్రయోజనం అందేలా చూస్తామని అన్నారు.


ఒక్కో మహిళకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం కల్పిస్తామనే హామీపై బిహార్ మంత్రివర్గం గత జనవరి 29న సమావేశమైంది. ఆరు నెలల అసెస్‌మెంట్ గడువులోగా రూ.10,000 మొత్తాన్ని సజావుగా ఉపయోగించుకున్న మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దశలవారిగా ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించినట్టు సమావేశానంతరం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.


ఇవి కూడా చదవండి..

మార్చి 31 కల్లా నక్సలిజానికి చెల్లుచీటీ : అమిత్‌షా

1.25 కోట్ల హిందువులకు అండగా నిలబడతాం.. బంగ్లాదేశ్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ హెచ్చరిక

Updated Date - Feb 08 , 2026 | 09:24 PM