ఎన్‌సీఈఆర్‌టీ వివాదంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..
ABN , Publish Date - Feb 26 , 2026 | 08:27 PM
జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠ్యాంశంగా చేర్చటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ‘వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు?.. బాధ్యులను గుర్తించారా? ’ అని మోదీ ప్రశ్నించారట.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠ్యాంశంగా చేర్చటం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు?.. బాధ్యులను గుర్తించారా? ’ అని మోదీ ప్రశ్నించారట.
ఇక, ఈ విషయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచారం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము న్యాయ వ్యవస్థకు అత్యున్నత స్థానం ఇచ్చాం. న్యాయ వ్యవస్థను కించపరచాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఇసుమంత కూడా లేదు. మేము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాము. న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తున్నాము. జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నా’ అని అన్నారు.
సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
ఎన్‌సీఈఆర్‌టీ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది జ్యుడీషియరీపై ప్రణాళికాబద్ధమైన, లోతైన దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభివర్ణించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ భూమ్మీద ఎవరినీ అనుమతించనని తేల్చిచెప్పారు. బుక్‌పై నిషేధం విధించారు. అన్ని కాపీలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. ఆన్‌లైన్ ద్వారా పుస్తకం మొత్తం లేదా దాని భాగాలను షేర్ చేయటంపై కూడా చీఫ్ జస్టిస్ నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వీసా తప్పనిసరి
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..