Share News

ధైర్యానికి శాశ్వత నిదర్శనం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళి..

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:25 PM

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ధైర్యానికి శాశ్వత నిదర్శనం.. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ప్రధాని మోదీ నివాళి..
Syama Prasad Mookerjee, PM Modi

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee) 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం, ప్రజాసేవ పట్ల చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఆయన జీవితం 'ధైర్యానికి, మాతృభూమి పట్ల అచంచలమైన నిబద్ధతకు కాలాతీత ఉదాహరణ' అని కొనియాడారు.


ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాలను ప్రస్తావించారు. శ్యామా ప్రసాద్ సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, దేశసేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని చెప్పారు. వలస పాలన, విభజన రాజకీయాలు, సామాజిక సవాళ్ల వంటి అంశాలపై ఆయన రాజీపడకుండా పోరాడారని గుర్తు చేశారు.

దేశ సమైక్యతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రజాజీవితానికి మూల సూత్రమని ప్రధాని అన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే కొనసాగడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అనంతరం జమ్మూ కశ్మీర్ సంపూర్ణ విలీనానికి కృషి చేస్తూ నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు (Syama Prasad Mookerjee 125th birth anniversary).


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఏలను 2019లో తమ ప్రభుత్వం రద్దు చేసిందని, అది శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు నిజమైన నివాళి అని ప్రధాని మోదీ అభివర్ణించారు (India unity).

అలాగే కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయసులో వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్యామా ప్రసాద్.. పరిశోధన, గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమల మంత్రి అయిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఎరువుల కర్మాగారం వంటి కీలక ప్రాజెక్టులకు పునాది వేశారని ప్రధాని గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి..

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 06 , 2026 | 12:37 PM