భూమి, ఆకాశం, పాతాళం.. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నా వదలొద్దు
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:22 AM
‘‘వాళ్లెక్కడున్నా సరే వెంటాడాలి. భూమ్మీద.. ఆకాశంలో.. పాతాళంలో.. ఎక్కడున్నా సరే, వారిని క్షమించే (వదిలే) ప్రసక్తే లేదు’’ ..పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారన్న...
పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే: డోభాల్
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ‘‘వాళ్లెక్కడున్నా సరే వెంటాడాలి. భూమ్మీద.. ఆకాశంలో.. పాతాళంలో.. ఎక్కడున్నా సరే, వారిని క్షమించే (వదిలే) ప్రసక్తే లేదు’’ ..పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారన్న వార్త తెలియగానే ప్రధాని మోదీ తమతో అన్నమాటలు ఇవేనని జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై.. డిస్కవరీ చానల్ రూపొందిస్తున్న ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ డాక్యుసిరీస్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో డోభాల్ ఈ విషయం చెప్పారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. దాన్ని మధ్యలోనే ముగించుకుని, భారత్‌కు తిరిగి వచ్చారని.. వచ్చీరాగానే విమానాశ్రయంలోనే తమతో సమావేశమయ్యారని వెల్లడించారు. ‘‘దాడికి సంబంధించిన వాస్తవాలన్నింటినీ ఆయన తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న.. ‘ఈ దాడి ఎవరు చేశారు? దీని వెనుక ఎవరున్నారు?’ అని. బాధ్యులు ఎవరనేదానిపై మనకు స్పష్టత ఉండాలని ఆయన పేర్కొన్నారు’’ అని డోభాల్ వివరించారు. చివరి ఉగ్రవాది మరణించేవరకూ ఉగ్రవాదంపై పోరు ఆగదనే బలమైన సందేశాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పంపాలని ప్రధాని భావించినట్టు తెలిపారు. ‘‘పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతునుగానీ.. ఉగ్రవాదంపై కఠినచర్యలు తీసుకోలేకపోవడంలో వారి అసమర్థతనుగానీ మేం సహించబోమనే విషయాన్ని వారికి తెలియజేయాలనుకున్నాం’’ అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తామని.. దానికి ఎలాంటి హద్దూ లేదని.. చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో నిఘా సంస్థలు అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా పనిచేశాయని.. ఆ సమాచారం ఆధారంగా తాము దాడుల విషయంలో ఒక నిర్ణయానికి రాగలిగామని, పక్కాగా దాడులు చేయగలిగామని డోభాల్ వివరించారు. అందుకు నిఘా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు