Share News

వడోదరలో రూ.35వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం!

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:50 PM

ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ వడోదరలో రూ. 35,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు.

వడోదరలో రూ.35వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం!
PM Modi Launches Rs.35,000 Crore Development Projects in Vadodara

వడోదర/నవసారి(గుజరాత్)సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ (మంగళవారం) వడోదరలో రూ. 35,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి దేశానికి అంకితం చేశారు. అనంతరం నవసారిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, అధికారం, వ్యవస్థలు, హోదాలు కేవలం ప్రజాసేవ కోసమేనని స్పష్టం చేశారు.


నవసారి సభలో ప్రధాని మోదీ ప్రసంగ ముఖ్యాంశాలు

సేవా దృక్పథమే బీజేపీ బలం: అధికారంలో ఉన్నామనే అహంకారం కాకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయడమే బీజేపీ శ్రేణుల ప్రధాన సూత్రమని ప్రధాని ప్రశంసించారు. తమ పార్టీ కార్యకర్తలకు 'విశ్రాంతి అనేది నిషిద్ధం' అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది అనునిత్యం ఆచరించే జీవిత విధానమని పేర్కొన్నారు.


ప్రజా భాగస్వామ్యంతోనే శాశ్వత మార్పు: నవసారి జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రధాని కొనియాడారు. సాధారణ పౌరుల భాగస్వామ్యంతో వచ్చే మార్పు మాత్రమే శాశ్వతంగా ఉంటుందని, అది సమాజంలో నూతన విశ్వాసాన్ని నింపుతుందని అన్నారు.


పోషకాహార లోపం, టీబీ రహిత జిల్లాగా నవసారి

నవసారిని పోషకాహార లోపం (Malnutrition) లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిని ప్రశంసిస్తూ.. 'ఒక జిల్లాను పోషకాహార లోపం లేకుండా చేయడం అనేది ఓట్ల కంటే లక్షల రెట్లు శక్తివంతమైన తల్లుల, కుటుంబాల ఆశీస్సులను అందిస్తుంది' అని అన్నారు. అలాగే క్షయ (TB) రహితంగా జిల్లాను మార్చడం ద్వారా రాబోయే భావి తరాల సంక్షేమానికి పునాది వేస్తున్నారని బీజేపీ కార్యకర్తలను అభినందించారు.

'అబద్ధాల హోరు కంటే యువత స్వరం మిన్న'

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' విద్యార్థి విజ్ఞప్తి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గుజరాత్‌లోని వడోదరలో నిర్వహించిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, 'అబద్ధాల హోరు' (జూత్ కీ గూంజ్) కంటే భారతీయ యువత స్వరం, వారి ఆకాంక్షలే గెలుస్తాయని స్పష్టం చేశారు.


గుజరాత్ ముఖ్యమంత్రిగా జ్ఞాపకాలు

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తొలి రోజులను గుర్తుచేసుకుంటూ, జూన్ నెలలో 44 డిగ్రీల తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా బాలికల విద్య కోసం గ్రామాలు తిరిగినట్లు చెప్పారు. చిన్న పిల్లలను బడులకు పంపాలని వారి తల్లిదండ్రులను ఒప్పించిన ఆ క్షణాలు, తనకు రాజకీయాధికారం కంటే ఎక్కువ సంతృప్తినిచ్చాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

అమరావతిని మారుస్తామనడం అవివేకం

Updated Date - Sep 08 , 2026 | 06:22 PM