నాలుగు దశాబ్దాల తర్వాత సరికొత్త చరిత్ర.. న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ!
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:54 PM
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ న్యూజిలాండ్ పర్యటన షురూ చేశారు. గత నాలుగు దశాబ్దాలలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆక్లాండ్ (న్యూజిలాండ్), జులై 10: భారత విదేశాంగ విధానంలో మరో కీలక అధ్యాయం మొదలైంది. ఆస్ట్రేలియాలో అత్యంత విజయవంతమైన పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ (శుక్రవారం) న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరానికి చేరుకున్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటనకు విచ్చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి పీఎం లక్సన్ ఆత్మీయంగా కౌగిలించుకుని సాదర స్వాగతం పలికారు.
ద్వైపాక్షిక బంధానికి సరికొత్త ఊపు
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గత రెండేళ్లుగా భారత్-న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం, రక్షణ రంగాలలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన 'సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (Free Trade Agreement) తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
పర్యటనలోని ప్రధానాంశాలు:
వ్యాపార, క్రీడా ప్రముఖులతో భేటీ: ఆక్లాండ్‌లో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడా రంగ ప్రముఖులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ప్రవాస భారతీయులతో ముఖాముఖి: భారత్-న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు (People-to-People ties) ప్రతీకగా, అక్కడ పెద్ద ఎత్తున స్థిరపడిన భారతీయ సమాజాన్ని (Diaspora) ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
అంతకుముందు 2025, మార్చి 17న న్యూజిలాండ్ పీఎం క్రిస్టోఫర్ లక్సన్ భారతదేశంలో పర్యటించినప్పుడు, న్యూఢిల్లీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, న్యూజిలాండ్ పర్యటనకు ముందు మూడు రోజులపాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత ప్రధాని తన ఆస్ట్రేలియా పర్యటన అత్యంత ఫలప్రదమైందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్