Share News

చర్చలు, దౌత్య మార్గాలతోనే..

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:17 AM

ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్‌ పర్యటనను ముగించుకొని కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌కు చేరుకున్నారు. ఆయన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా...

చర్చలు, దౌత్య మార్గాలతోనే..

ఏ సమస్యల పరిష్కారానికైనా ఇదే మార్గం.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళనకరం

  • ఇరాన్‌ అధ్యక్షుడితో భేటీలో మోదీ

  • కిర్గిస్థాన్‌లో ఎస్‌సీవో సదస్సు సందర్భంగా నేతల చర్చలు

  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ భేటీ

బిష్కెక్‌, ఆగస్టు 31: ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్‌ పర్యటనను ముగించుకొని కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌కు చేరుకున్నారు. ఆయన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, భారత్‌-ఇరాన్‌ సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై నేతలిద్దరూ చర్చించారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు, వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సి ఉందని మోదీ తేల్చిచెప్పారు. మరోవైపు, యుద్ధసంక్షోభ సమయంలో తమకు మద్దతుగా నిలిచిన భారత్‌కు పెజెష్కియాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌ ఎన్నడూ యుద్ధాన్ని స్వాగతించదన్నారు. కానీ, తమ దేశ ప్రజలను యుద్ధం బారి నుంచి కాపాడుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. సంక్షోభ నివారణకు సాయం చేయాలని ప్రధాని మోదీని కోరారు. కాగా, భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే అంశాలపై భారత్‌ ప్రాధాన్యాలను మోదీ ఎస్‌సీవో సదస్సులో వివరించనున్నారు.

ఎడతెగని యుద్ధాల నుంచి..శాంతి దిశగా

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా బిష్కెక్‌లో మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంపై భారత్‌ వైఖరిని మరోసారి తేటతెల్లం చేశారు. ‘‘అంతులేని యుద్ధాల నుంచి.. యుద్ధానికే ముగింపు పలికే దిశగా సాగాలి’’ అని ఆకాంక్షించారు. తక్షణమే యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను కోరారు. కాగా, సెప్టెంబరులో ఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ రానున్నట్లు మోదీ ఈ సందర్భంగా ధ్రువీకరించారు.

6-National-1-09.jpg

మోదీ కవితలకు

ఉజ్బెక్‌ విద్యార్థుల నీరాజనం

మోదీ స్వయంగా రచించిన కవితలను తాష్కెంట్‌లో ఉజ్బెకిస్థాన్‌ విద్యార్థులు హిందీ, ఉజ్బెక్‌ భాషల్లో ఆలపించడం ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఓరియంటల్‌ స్టడీస్‌ విద్యార్థులు మోదీ రాసిన మూడు కవితలను చదివారు. ‘అభీ తో సూరజ్‌ ఉగా హై’, ‘నయే భారత్‌ కే నయే సంకల్ప్‌’, ‘మానవతా కో కహీం నా లగ్‌ జాయే దాగ్‌’ కవితలను విద్యార్థులు చదివారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. చాలా ఏళ్ల కిందట తాను రాసిన కవితలను ఇప్పుడు ఉజ్బెక్‌ విద్యార్థులు హిందీలో ఆలపించడం తనను కదిలించిందన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..

భారత్, బంగ్లాదేశ్ సిరీస్‪పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!

ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 01 , 2026 | 06:17 AM