Share News

యువత భవితే ముఖ్యం

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:37 AM

గత కొన్ని వారాలుగా దేశాన్ని కుదిపేస్తున్న నీట్‌ పేపర్‌ లీకేజీ, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారికి వీలైనంత త్వరగా...

యువత భవితే ముఖ్యం

  • అదే మా ప్రాధాన్యం

  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తాం

  • ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితంగా,

  • కఠినమైన శిక్షలు పడేలా చూస్తాం

  • ఎక్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన

  • నెలన్నర తర్వాత ప్రధాని స్పందించారు

  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులున్నా లీకేజీలు జరుగుతున్నాయి

  • కారణం.. ధర్మేంద్ర ప్రధాన్‌ అసమర్థత

  • ఆయన రాజీనామా చేసే వరకూ కదిలేది లేదు

  • ప్రజాగ్రహం మోదీ మీదకూ మళ్లుతోంది: సీజేపీ

న్యూఢిల్లీ, జూలై 23: గత కొన్ని వారాలుగా దేశాన్ని కుదిపేస్తున్న నీట్‌ పేపర్‌ లీకేజీ, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారికి వీలైనంత త్వరగా కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘మన యువత సంక్షేమం, భవిష్యత్తుకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. ఇదే మాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. యువత భవిష్యత్తుకు నష్టం చేసే ప్రయత్నాలు చేసే వారిని ఉపేక్షించేది లేదు’ అని మోదీ పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీలకు సంబంధించి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇదొక ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ప్రధాని ప్రకటనపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్‌ రంకా స్పందిస్తూ.. ‘నెలన్నరగా జరుగుతున్న నిరసనల తర్వాత మొత్తానికి ప్రధాని ఈ విషయాన్ని పట్టించుకున్నారు. బహుశా ఆయన విదేశీ పర్యటనలు పూర్తయి భారత్‌కు వచ్చినట్లున్నారు. ఏదేమైనా ఇదొక మంచి పరిణామమే. కానీ, ఇప్పటికే జరిగిన పేపర్‌ లీకేజీలకు సంబంధించిన బాధ్యులకు మీరు ఏ శిక్షలు విధించారు? గాయం అయిన తర్వాత మందు రాయటం ఒకటైతే.. అసలు గాయం కాకుండా చూడటం మరొకటి. వ్యవస్థను నడుపుతున్న వాళ్లు అసమర్థులు, నిజాయితీ లేని వారు కాబట్టి గాయాలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి, ఈ చర్యలు ఎంతమా త్రం సరిపోవు’ అని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదన్నారు. ‘దేశంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉన్నా పేపర్‌ లీకేజీలు జరుగుతున్నాయి.. దానికి కారణం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అసమర్థత. ఎటువంటి లోపాలకు తావు లేని సమర్థమైన పరీక్షల వ్యవస్థను నెలకొల్పటంలో ఆయన విఫలమయ్యారు.


ఈ దేశ యువత ఒకే ఒక్కటి డిమాండ్‌ చేస్తోంది.. అది జవాబుదారీతనం మాత్రమే’ అని తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటన.. అసలు డిమాండ్ల నుంచి దృష్టి మళ్లించే యత్నమని, దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై అది ఒక క్రూరమైన జోక్‌ అని ఆరోపించారు. తాము సుదీర్ఘమైన న్యాయప్రక్రియలను కోరుకోవటం లేదని, తక్షణ న్యాయా న్ని, జవాబుదారీతనాన్ని అడుగుతున్నామని.. ధర్మేంద్రప్రధాన్‌పై చర్యలు తీసుకోవటంతో దానిని ప్రారంభించాలని అశుతోష్‌ రంకా డిమాండ్‌ చేశారు. విద్యామంత్రి రాజీనామా చేసేంతవరకూ తాము జంతర్‌మంతర్‌ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రజాగ్రహం మోదీ మీదకు కూడా మళ్లుతోందని, పేపర్‌ లీకేజీలను, విద్యార్థుల నిరసనను ఆయన ఎందుకు పట్టించుకోలేదని నినాదాలు ఇస్తున్నారని అశుతోష్‌ రంకా పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 05:37 AM