Share News

సుస్థిరతకే పట్టం

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:05 AM

దేశాభివృద్ధికి రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండటం అవసరమని ప్రజలు గుర్తించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

సుస్థిరతకే పట్టం

  • 12 ఏళ్ల పాలన ప్రజల పరిణతికి తార్కాణం

  • కాంగ్రెస్‌ దుర్మార్గ ఉచ్చునుంచి దేశానికి రక్షణ

  • ఎన్డీయే సాధించిన గొప్ప విజయం ఇదే

  • నాడు దేశ ప్రజలకు కాంగ్రెస్‌ తీరని ద్రోహం

  • పాలన, రాజకీయాల్లో అస్తవ్యస్త పరిస్థితులు

  • 2014లో ఎన్డీయేనే చివరి ఆశాకిరణం

  • ప్రతి ఎన్నికలోనూ మాపై సంపూర్ణ విశ్వాసం

  • వికసిత్‌ భారత్‌.. ఇప్పుడు అందరి సంకల్పం

  • కూటమి భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండటం అవసరమని ప్రజలు గుర్తించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి...12 ఏళ్లు ప్రధానిగా కొనసాగిన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పాలనారికార్డును బ్రేక్‌ చేసిన మోదీకి అభినందనగా ఢిల్లీలో ఎన్డీయే కూటమి నేతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ మాట్లాడారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి సంబంధించింది ఎంతమాత్రం కాదని, అదిప్పుడు ప్రతి ఒక్కరి సంకల్పంగా మారిందని తెలిపారు. ‘ప్రజలను దేవుని ప్రతిరూపాలుగా తలుస్తాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. తొలిసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న 2014కు ముందు పరిస్థితులను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘2014కు ముందు కొన్ని దశాబ్దాలపాటు రాజకీయాల్లో, పాలనలో తీవ్రమైన సంక్షోభాలు, అస్థిరత రాజ్యమేలాయి. స్థిరమైన ప్రభుత్వం ఏం చేయగలుగుతుందనేది ఇన్నాళ్లకు ప్రజలు గ్రహించగలిగారు. వారి పరిణతికి నిదర్శనంగానే 12 ఏళ్లుగా పాలిస్తున్నాం. కాంగ్రెస్‌ దుర్మార్గపు ఉచ్చునుంచి దేశాన్ని రక్షించడం ఎన్డీయే కూటమి సాధించిన గొప్ప విజయం. మాకు ముందు పాలించిన కాంగ్రెస్‌ దేశ ప్రజలకు ద్రోహం చేసింది. 2014 నాటికి ప్రజలకు ఎన్డీయే ఆశాకిరణంగా కనిపించింది. కాంగ్రెస్‌ను ప్రతిసారీ తిరస్కరించడం ద్వారా మా ప్రభుత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. ఈ విజయం ఎన్డీయే భాగస్వామ్య నేతలందరికీ చెందుతుంది’’ అని మోదీ వ్యాఖ్యానించింది.

1.jpg


మోదీకి క్యాబినెట్‌, ఎన్డీయే నీరాజనాలు

భారత తొలి ప్రధాని నెహ్రూ పాలనా రికార్డును బద్దలుకొట్టి దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన ఘనత సాధించిన మోదీకి కేంద్ర క్యాబినెట్‌, ఎన్డీఏ కూటమి సభ్యులు నీరాజనాలు పట్టారు. ప్రధానమంత్రిగా మోదీ జరిపిన 12 ఏళ్ల యాత్ర భారత ప్రజాస్వామ్య చైతన్యానికి, ప్రజా విశ్వాసానికి, ప్రజల భాగస్వామ్యానికి సంకేతమంటూ...కేంద్ర క్యాబినెట్‌ తీర్మానించింది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశానికి మోదీ హాజరైనప్పుడు, మంత్రులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. ఒక ప్రభుత్వాధినేతగా మోదీ పాతికేళ్ల నిరంతర ప్రజాసేవ చేసిన నేతగా చరిత్ర సృష్టించారన్నారు. 2014లో తనను తాను ప్రధాన సేవకుడుగా అభివ ర్ణించుకున్న మోదీ సబ్‌ కీ సాథ్‌, సబ్‌ కీ విశ్వాస్‌ మంత్రానికి కట్టుబడి ఉన్నారని కొనియాడింది. ఆర్టికల్‌ 370 రద్దు, జీఎస్టీ, వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛను, సీఏఏ, భారత న్యాయసంహిత, లేబర్‌ కోడ్‌ ల సంఘటీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని, నక్సలిజంతో పాటు ఉగ్రవాదాన్నీ దునుమాడి, ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతంగా అమలు చేశారని క్యాబినెట్‌ ప్రశంసించింది. అంతర్జాతీయంగా భారత్‌ కు పేరు ప్రతిష్ఠలు సాధించారని, మేక్‌ ఇన్‌ ఇండియాను విజయవంతంగా అమలుచేశారని పేర్కొంది.

22 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల హాజరు

క్యాబినెట్‌ సమావేశం అనంతరం భారత మండపంలో ఎన్డీఏ కూటమి నేతలను మోదీ కలుసుకున్నారు. మోదీ సాధించిన రికార్డును అభినందిస్తూ ఎన్డీఏలో కీలక భాగస్వామి, ఏపీ సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఎన్డీఏ సమావేశానికి వచ్చిన మోదీకి చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికి కండువా కప్పారు. ఆయనకు బాలాజీ విగ్రహాన్ని బహూకరించారు. ఆ తర్వాత జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు ఒకరి తర్వాత మరొకరు మోదీని శాలువలు, పుష్పగుచ్ఛారు, కండువాలతో సత్కరించారు. ఎన్డీఏ నేతలంతా ప్రధానితో గ్రూపు ఫొటో దిగారు. అనంతరం మోదీ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. దేశంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధన తదితర అంశాలపై మోదీ సమీక్షను నిర్వహించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 22 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు.


భారత భవిష్యత్తు విధాత

స్వతంత్ర భారతావని రాజకీయ ప్రస్థానంలో ప్రధాని మోదీ పదవీకాలం ఒక అద్వితీయమైన గాథను ఆవిష్కరిస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశానికి ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం పదవిలో కొనసాగడం ద్వారా మోదీ రికార్డు సృష్టించడంపై ఆయన జాతీయ మీడియాకు రాసిన ప్రత్యేక వ్యాసంలో స్పందించారు. మోదీని భారత భవిష్యత్తు విధాతగా అభివర్ణించడానికి ఏమాత్రం సంకోచించబోనని అందులో స్పష్టం చేశారు. మరోవైపు, ప్రధాని మోదీ స్వయం ప్రకటిత మైలురాయిని దాటి ఉండొచ్చేమో గానీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సారథ్యం వహిస్తూ దేశానికి ఒక గుదిబండలా మారారని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

‘ఝుల్‌ మురీ’ని పంచిన మోదీ

బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ దుకాణంలో ఝుల్‌మురీని ప్రధాని మోదీ కొనుగోలుచేసి తినడం అప్పట్లో ఆసక్తి కలిగించింది. ఆ ఎన్నికల్లో చర్చనీయాంశమైన ఈ చిరుతిండి, బుధవారం ఎన్డీయే కూటమి సమావేశంలోనూ ఆకర్షణగా నిలిచింది. సమావేశానికి హాజరైన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు ఝుల్‌మురీని పంచిపెట్టారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి తొలుత ప్రధానికి ఝుల్‌మురీని అందించగా, ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సమావేశ మందిరంలోని అందరికీ పంపిణీ చేశారు.

Updated Date - Jun 11 , 2026 | 04:05 AM