నీట్ పేపర్ లీక్ మహాపాపం
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:46 AM
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అత్యంత ఘోరమని, మహాపాపమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ బాధ్యులను ప్రభుత్వం ఇప్పటికే కటకటాల్లోకి నెట్టిందని తెలిపారు....
పిల్లలను రెచ్చగొట్టడం సరికాదు
పేపర్ లీక్ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తాం
ప్రశ్నప్రతాల లీకేజీలు నివారించడం జాతీయ బాధ్యత
పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చలకు విపక్షాలు సహకరించాలి
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ
ఆస్పత్రిపాలైన విద్యార్థులకు జేపీ నడ్డా పరామర్శ
న్యూఢిల్లీ, జూలై 21: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అత్యంత ఘోరమని, మహాపాపమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ బాధ్యులను ప్రభుత్వం ఇప్పటికే కటకటాల్లోకి నెట్టిందని తెలిపారు. నిరసనలు చేపడుతున్న పిల్లలను రెచ్చగొట్టవద్దని, యువతను సరైన మార్గంలో నడిపించే అంశంలో సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. లీకేజీ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యను నివారించేందుకు పార్టీలకతీతంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీలను నివారించడమనేది రాజకీయ అంశం కాదని జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. మంగళ్ మిలన్ పేరిట న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు వెల్లడించారు. ‘‘ప్రశ్నపత్రం లీకేజీ అంశం బయటకు వచ్చిన వెంటనే స్పందించిన ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, 13 మందిని అరెస్టు చేసింది విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే నీట్ రీఎగ్జామినేషన్ నిర్వహించాం. ఎలాంటి జాప్యం లేకుండా ఫలితాలు కూడా ప్రకటించాం. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. దేశంలోని అత్యుత్తమ న్యాయవాదుల సహకారంతో దోషులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చేయాలి. అప్పుడే ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు పునరావృతం కావు. ప్రశ్నపత్రాల లీకేజీ అనేది ఏ ఒక్క రాష్ట్రానికో, కేంద్ర ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదు. దేశానికి సంబంధించిన సమస్య. ప్రశ్నపత్రాలు లీక్ చెయ్యడమనేది మహా పాపం, ఘోరం. లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్టీలకతీతంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పని చేయాలి. లీకేజీలను నివారించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో నిరసనల్లో పాల్గొంటున్న పిల్లలను రెచ్చగొట్టవద్దు. యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది’’ అని ఎంపీలతో ప్రధాని అన్నారని రిజిజు వెల్లడించారు. కాగా, ఎన్డీయే ప్రభుత్వం వివిధ దేశాలతో చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్) అంశంలో రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారని రిజిజు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!