విభజన శక్తులకు వ్యతిరేకంగా ఏకమవ్వాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:01 AM
విభజన శక్తులకు వ్యతిరేకంగా సమాజం అంతా ఒక్కటవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు
దేశం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి
సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత చురుగ్గా ఉండాలి
యువత భాగస్వామ్యంతో బలమైన భారత్‌ను నిర్మించాలి
‘చిన్మయ మిషన్’ సమ్మేళనంలో ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ, అక్టోబరు 23: విభజన శక్తులకు వ్యతిరేకంగా సమాజం అంతా ఒక్కటవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజల్లో స్వావలంబనపై అవగాహన పెంచడంతోపాటు దేశంలోని ప్రతి ఒక్కరినీ 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంతో అనుసంధానించాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగాదేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, సమాజంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన చిన్మయ మిషన్ అమృత మహోత్సవ అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్మయ మిషన్ సేవలను ప్రధాని ప్రశంసించారు. స్వామి చిన్మయానంద ప్రారంభించిన ఆధ్యాత్మిక ఉద్యమం ద్వారా లక్షలాది మంది యువత భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా నిలుస్తున్నారని చెప్పారు. చిన్మయానందతో తనకున్న అనుబంధాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యానికి తన పాలనలోనూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చిన్మయ మిషన్ అమృత మహోత్సవంలో భాగంగా యువ వలంటీర్లు 300 రోజుల వ్యవధిలో 40 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి లక్ష మందికి పైగా యువతను కలుసుకోవడాన్ని మోదీ అభినందించారు. భారతీయ తాత్విక సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ఉపనిషత్తుల్లోని ‘వయం అమృతస్య పుత్రః’ అనే వాక్యాన్ని మోదీ ఉటంకించారు. మనం అమృతత్వానికి వారసులమనే భావన భారతీయ జ్ఞాన సంపదకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని వివరించారు. వేల సంవత్సరాలుగా భారత్ జ్ఞాన అన్వేషణ, ఆధ్యాత్మిక వికాసం దిశగా సాగుతోందని చెప్పారు. దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించడం, జాతీయ ప్రగతికి తోడ్పడడం ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. దేశ సాంస్కృతిక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుండడం సంతోషకరమని, గత 12ఏళ్లలో 650కు పైగా ప్రాచీన విగ్రహాలను విదేశాల నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్లు మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
సవాళ్లు మారుతున్నాయి
కాలానుగుణంగా సవాళ్లు మారుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సంస్థలు, ప్రజలు మరింత చురుగ్గా వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక్కో సంస్థకు ఒక్కో లక్ష్యం ఉన్నప్పటికీ, అంతిమంగా దేశాభివృద్ధి, జాతీయ గౌరవం అనే ఉమ్మడి గమ్యమే అందరినీ నడిపించాలని అన్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయడం, పౌరులను స్వావలంబన దిశగా ప్రేరేపించడం, ప్రతి ఒక్కరినీ వికసిత భారత్ సంకల్పంలో భాగస్వాములను చేయడం తక్షణ కర్తవ్యాలని స్పష్టం చేశారు. 1951లో చిన్మయానంద స్థాపించిన చిన్మయ మిషన్ 75ఏళ్ల ప్రస్థానానికి ముగింపుగా నిర్వహిస్తున్న ఈ 3రోజుల అంతర్జాతీయ సమ్మేళనంలో 9 వేల మందికి పైగా పాల్గొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!
మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం