Share News

ఆందోళన వద్దు.. నేను మీతోనే!

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:50 AM

పార్లమెంటు.. ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయమని ప్రధాని మోదీ అన్నారు. అయితే దాని కార్యకలాపాలను తరచూ అడ్డుకోవడం బాధాకరమని చెప్పారు.

ఆందోళన వద్దు.. నేను మీతోనే!
PM Modi

  • ఎన్‌డీయే ఎంపీలకు మోదీ హామీ.. 37 మందితో అల్పాహార భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంటు.. ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయమని ప్రధాని మోదీ అన్నారు. అయితే దాని కార్యకలాపాలను తరచూ అడ్డుకోవడం బాధాకరమని చెప్పారు. గందరగోళం కారణంగా కొత్త సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం లభించడం లేదన్నారు. ఇది వారికి జరుగుతున్న అన్యాయమని.. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని వ్యాఖ్యానించారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కొత్త సభ్యులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. శుక్రవారం తన అధికార నివాసంలో ఆయన 37 మంది ఎన్‌డీయే ఎంపీలతో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు.


వీరిలో 20 మంది ఎన్‌సీపీఐ ఎంపీలు (టీఎంసీ రెబెల్స్‌), శివసేన(శిండే)లో చేరిన ఆరుగురు శివసేన-యూబీటీ ఎంపీలతో పాటు అన్నాడీఎంకే, ఆర్‌పీఐ (అథావలే), రాష్ట్రీయ లోక్‌మోర్చా, యూపీపీఎల్‌ సభ్యులు కూడా ఉన్నారు. ‘మీమీ రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుబడండి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది. ఎన్‌డీఏ ఓ కుటుంబం. మనమంతా భాగస్వామ్య పార్టీలం. ప్రతి ఒక్కరికీ గౌరవం, అవకాశం దక్కుతాయి. ప్రతి మిత్రపక్షానికే కాదు.. ప్రతి ఎంపీకీ తోడుగా ఉంటా. ఎవరి గురించీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పని కావాలన్నా నేరుగా ప్రధాని కార్యాలయాన్ని సందర్శించండి’ అని మోదీ ఎంపీలకు సూచించారు.


ఆ తర్వాత ప్రతి ఒక్క ఎంపీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, కేంద్ర మంత్రి రాందాస్‌ అథావలే, ఇటీవల జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీకి హాజరుకాని టీఎంసీ రెబెల్స్‌ ఖలీలుర్‌ రహమాన్‌, యూసఫ్‌ పఠాన్‌, అబూ తాహెర్‌ ఖాన్‌ కూడా హాజరయ్యారు. ప్రధానికున్న పరిజ్ఞానం, తమ పట్ల చూపిన గౌరవం చూసి విస్మయం చెందామని ఎన్‌సీపీఐ ఎంపీ కకోలీ ఘోష్‌ అన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ యోగా చేయాలని మోదీ నొక్కిచెప్పారని ఎన్‌సీపీఐ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయ్‌ అన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 06:50 AM