తర్కంతో చర్చిస్తే గందరగోళం ఉండదు!
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:25 AM
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సభలో తార్కికంగా, వాస్తవాలతో చర్చిస్తే జరిగితే గందరగోళానికి, అరుపులు, కేకలకు ఆస్కారం ఉండదన్నారు...
పార్లమెంటులో ప్రతి ఒక్కరికీ మాట్లాడే
అవకాశం రావాలి: ప్రధాని
న్యూఢిల్లీ, జూలై 20: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సభలో తార్కికంగా, వాస్తవాలతో చర్చిస్తే జరిగితే గందరగోళానికి, అరుపులు, కేకలకు ఆస్కారం ఉండదన్నారు. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల చోరీ, ఈ-20 పెట్రోల్‌పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమైన నేపథ్యంలో సోమవారం వర్షాకాల సమావేశాల ప్రారంభ దినాన పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రుతుపవనాలు సానుకూల ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. రెండూ ఫలప్రదమైనప్పుడు జాతి ఉన్నతిలో, ప్రజల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. ఈఆశతోనే రుతుపవనాలు మరింత క్రియాశీలమవుతాయని.. పార్లమెంటు సమావేశాలు కూడా ఫలప్రదమవుతాయని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సమష్టి తీర్మానాలు చేయాలని నొక్కిచెప్పారు. పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు, సమష్టి నిర్ణయాలు జరగాలని.. ప్రస్తుత కాలానికి ఇది అవసరమని, యువత ఆకాంక్ష కూడా ఇదేనని తెలిపారు. దేశభక్తి, జాతీయ అంకిత భావంతో కూడిన గళాలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం రావాలన్నది ప్రస్తుత డిమాండ్‌గా పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ప్రధాని ఈ సందర్భంగా సెటైర్లు వేశారు. భారత తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయవంతంలో యువత కీలక పాత్ర పోషించారని.. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిందని.. ఇది యువ ఆవిష్కర్తల విజయమని, ఈ స్టార్టప్ బృంద సభ్యుల సగటు వయసు 28 ఏళ్లని వ్యాఖ్యానించారు. తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడడం లేదని రాహుల్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. పశ్చిమాసియా యుద్ధం.. చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు పెనుసంక్షోభం తెచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువులు, రసాయనాల సరఫరాకు ఆటంకాలు ఎదురయ్యాయని.. అయినా భారత్ 7.7 శాతం వృద్ధిరేటు కొనసాగిస్తోందని చెప్పారు. దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రారంభించామని,ఇది భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, శ్రామికుల అంకితభావం పర్యవసానమని ప్రశంసించారు.
అవి పాతచింతకాయ వ్యాఖ్యలు: కాంగ్రెస్
ప్రధాని మోదీ. అరిగిపోయిన పాతచింతకాయ వ్యాఖ్యలు చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవాచేశారు. ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీ ఎకోసిస్టమ్ సభ్యులు చేసిన రామాలయ విరాళాల భారీ చోరీ, నీట్ పేపర్ లీక్ వంటి కీలక అంశాలను ప్రస్తావించడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలను చీల్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశం-ఒకే ఎన్నిక గిమ్మిక్కును, వికసిత్ భారత్ శిష్టా అధిష్ఠాన్ బిల్లు ద్వారా ప్రజాసామ్యాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని చెప్పలేదన్నారు.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.