నాలుగో రోజూ స్తంభించిన పార్లమెంట్
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:51 AM
ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయసభలు నాలుగోరోజూ, గురువారం కూడా స్తంభించిపోయాయి. నీట్‌పై చర్చించడానికి సిద్దమేనని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ....
నీట్‌పై చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం
ధర్మేంద్ర రాజీనామాకు విపక్షాలు పట్టు
బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు
రిజిజు, సీతారామన్, గోయల్ ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయసభలు నాలుగోరోజూ, గురువారం కూడా స్తంభించిపోయాయి. నీట్‌పై చర్చించడానికి సిద్దమేనని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థుల పట్ల పోలీసుల క్రూరత్వంపైనా చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఎలాంటి కార్యకలాపాల్లేకుండా ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టీఎంసీ ఎంపీలు సౌగతరాయ్, మహువా మొయిత్రా తదితరులూ స్పీకర్‌తో స మావేశమై చర్చించారు.
ప్రతిపక్షాలు పారిపోతున్నాయ్..
నీట్ వ్యవహారంపై ప్రభుత్వం తన వైఖరిని వివరించేందుకు సిద్దం గా ఉందని పార్లమెంట రీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. తాము చర్చించడానికి సిద్దంగా ఉన్నా ప్రతిపక్షాలే తప్పించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్‌పర్సన్ చర్చకు అంగీకరించినా, విపక్షం సభాకార్యకలాపాలకు అడ్డుపడుతోందని విమర్శించారు. పేపర్ లీక్ అంశంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘవాల్ స్పందిస్తూ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం కీలకమైన నిర్ణయమన్నారు. నీట్ పేపర్ లీక్‌లో బాధ్యులపై వేగంగా చర్యలు తీసుకోవాలన్న విద్యార్థుల డిమాండ్‌కు ఇది పరిష్కారం చూపుతుందన్నారు. మరోవైపు, నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చిద్దామంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ పారిపోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు. పార్లమెంట్‌లో చర్చిస్తే తమ ద్వంద్వ ప్రమాణాలు బయటపడతాయని భయపడుతోందన్నారు.
ఢీ అండే ఢీ..
పార్లమెంటు మకరద్వారం వద్ద అధికార, ప్రతిపక్షాలు వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. విపక్షాల నిరసనల్లో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. విద్యామంత్రి రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు. మరోవైపు నీట్‌పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఎన్డీఏ ఎంపీలు కూడా ప్రదర్శన నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు