Share News

కీలక బిల్లులపై కేంద్రం పట్టు!

ABN , Publish Date - Aug 24 , 2026 | 05:59 AM

మహిళా రిజర్వేషన్‌, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం మోదీ సర్కారు కొత్త సమావేశాల దాకా వేచి చూడాలని అనుకోవడం లేదా? ప్రస్తుత పార్లమెంటు..

కీలక బిల్లులపై కేంద్రం పట్టు!

  • ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలనే యోచన?

  • పార్లమెంటు వాయిదా పడి 10 రోజులు.. అయినా ప్రొరోగ్‌ చేయని వైనం

  • అక్రమంగా 2/3 మెజారిటీ సాధించేందుకు షా పావులు కదుపుతున్నారేమో?

  • ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలున్నాయి: కాంగ్రెస్‌ నేత జైరాం

న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం మోదీ సర్కారు కొత్త సమావేశాల దాకా వేచి చూడాలని అనుకోవడం లేదా? ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆ కీలక బిల్లులకు చట్టబద్ధత కల్పించాలనే పట్టుదలతో ఉందా? అంటే తాజా ‘పరిణామాలు’ అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు! ఉభయసభలను ఈనెల 13న నిరవధికంగా వాయిదా (సైనడై) వేశారు. అంటే.. ఇది జరిగి 10 రోజులు గడిచాయి! ఆదివారం రాత్రి వరకు కూడా సమావేశాలు ప్రొరోగ్‌ (లాంఛనంగా ముగిసినట్లుగా) చేస్తున్నట్లుగా నోటిఫికేషన్‌ వెలువడలేదు. సాధారణంగానైతే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడ్డాక మూడు, నాలుగు రోజుల్లో సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తున్నట్లుగా ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడుతుంది. ఈసారి అలా జరగకపోవడంతో పార్టీల నుంచి సరిపడా మద్దతు కూడగట్టుకొని, కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 18న ముగిసి.. అదే నెల 20న ప్రొరోగ్‌ అయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటిదాకా వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తున్నట్లుగా ప్రకటన విడుదల కాకపోవడంతో 2029 సార్వత్రిక ఎన్నికలను పెంచిన నియోజకవర్గాలు, మహిళా రిజర్వేషన్‌ అనుగుణంగానే నిర్వహించాలనే పట్టుదలతో సర్కారు ఉందనే ఊహాగానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు. వాస్తవానికి ఈ బిల్లులను గత బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తెచ్చినా తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆమోదం లభించలేదు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను 50శాతం మేర పెంచేందుకుగాను ఓ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పంద్రాగస్టు తర్వాత ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చునన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. కాగా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 10 రోజులు గడిచినా ప్రొరోగ్‌ కాకపోవడంపై అదివారం కాంగ్రెస్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం ఎన్డీయేకు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల మెజారిటీని కూడగట్టేందుకు అమిత్‌ షా పావులు కదుపుతున్నారా? అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. లోక్‌సభ నిరవధిక వాయిదా, ప్రొరోగ్‌కు మధ్య సాధారణంగా రెండు, మూడు రోజుల వ్యవధి ఉంటుందని.. తాజా సమావేశాల ప్రొరోగ్‌ గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందకపోవడం అనుమానాలకు తావిస్తోంని ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. ‘ఈ అసహజమైన ఆలస్యానికి కారణం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రొరోగ్‌ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి.. ఏదో కుట్రకు తెగబడేందుకు కేంద్రం వ్యూహం పన్నుతోందనే అనుమానాలు బలపడుతున్నాయని ఆయన ఆరోపించారు.


కేంద్ర మంత్రుల నివాసాలకు11 ఏళ్లలో రూ.547 కోట్లు ఖర్చు

మోదీ సర్కారు కేంద్ర మంత్రుల నివాస భవనాల నవీకరణ, మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. 2025-26లో ఏకంగా రూ.92 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చింది. కేంద్ర క్యాబినెట్‌లో సాధారణంగా 70-72 మంది మంత్రులు ఉంటారు. ఈ ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మంత్రి బంగళా కోసం చేసిన సగటు వ్యయం రూ.1.27 కోట్లుగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం (మోదీ హయాంలో మొదటి ఏడాది)లో సెంట్రల్‌ ఢిల్లీలో ఉన్న మంత్రుల బంగళాల మరమ్మతులు, నవీకరణ, ఫర్నిషింగ్‌ తదితర పనుల కోసం చేసిన వ్యయం రూ.27.47 కోట్లుగా ఉంది. ఈ ప్రకారం చూస్తే 11 ఏళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఇక ఈ 11 ఏళ్లలో (2014-15 నుంచి 2025-26 వరకు) ఈ రూపేణా కేంద్ర ప్రజా పనుల విభాగం చేసిన మొత్తం వ్యయం రూ.547.68 కోట్లకు చేరింది. భవనాలు పాతవైపోవడంతో వాటి నిర్వహణ వ్యయం భారీగా పెరిగినట్టు అధికార వర్గాల వివరణగా ఉంది. ఢిల్లీలోని లూటెన్స్‌ జోన్‌లో 1912-1930 మధ్య మంత్రుల కోసం ఇళ్లను నిర్మించడం గమనార్హం. చాలా భవనాల వయసు 80-100 ఏళ్లకు చేరడంతో.. వాటి నిర్వహణ, మరమ్మతుల వ్యయం తడిసి మోపెడవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 05:59 AM