ఆద్యంతం రచ్చ.. రచ్చ
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:03 AM
అరుపులు.. కేకలు.. నినాదాలు.. వాయిదాలతో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. అవే నినాదాలతో గురువారం నిష్ఫలంగా ముగిశాయి. గత నెల 20న ప్రారంభమైన సమావేశాల్లో..
ఎలాంటి చర్చలు లేకుండానే ముగిసిన పార్లమెంటు సమావేశాలు
నీట్ లీక్, అయోధ్య విరాళాల చోరీ, విద్యార్థుల మీద లాఠీచార్జీపై రచ్చ
లోక్‌సభ షెడ్యూల్ సమయంలో 15 శాతమే సద్వినియోగం
రాజ్యసభ సమయంలో 39 శాతం చర్చలు
సభా సమయం వృథాపై బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
న్యూఢిల్లీ, ఆగస్టు 13: అరుపులు.. కేకలు.. నినాదాలు.. వాయిదాలతో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. అవే నినాదాలతో గురువారం నిష్ఫలంగా ముగిశాయి. గత నెల 20న ప్రారంభమైన సమావేశాల్లో ఏ ఒక్కరోజూ పూర్తి సమయం చర్చ జరగలేదు. నీట్ పరీక్ష పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, పెల్లెట్ల ప్రయోగం, ఈ20 పెట్రోల్ తదితర అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా లోక్‌సభను విపక్షాలు దాదాపు పూర్తిగా స్తంభింపజేశాయి. ఈ సెషన్‌లో లోక్‌సభలో చర్చకు నిర్ధేశించిన సమయంలో 15 శాతమే సద్వినియోగం అయ్యింది. మొత్తం ప్రశ్నోత్తరాల సమయంలో 1 శాతం మాత్రమే సద్వినియోగం అయ్యింది. అంటే మొత్తంగా 9 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. రాజ్యసభ సమయం 39 శాతం సద్వినియోగం అయ్యింది. సభ స్తంభించినప్పటికీ లోక్‌సభ ఎలాంటి చర్చ లేకుండానే 10 బిల్లులను ఆమోదించింది. పరీక్ష పేపర్ల లీక్ నిరోధక బిల్లుపై మాత్రమే 10 గంటలపాటు చర్చ జరిగింది. వందేమాతర గీతాన్ని అవమానించేవారిని శిక్షించేందుకు ఉద్దేశించిన జాతీయ గౌరవ అవమాన నిరోధక బిల్లు-2026పై ఇద్దరు సభ్యులు మాట్లాడారు. బిల్లు కొద్ది నిమిషాల చర్చతో ఆమోదం పొందింది. మొత్తంగా లోక్‌సభ ఈ సెషన్‌లో 12 బిల్లును ఆమోదించింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదింపజేసుకోలేకపోయింది. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలపటంతో ప్రభుత్వం దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. 18 రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి అడుగు పెట్టిన 4 నిమిషాలకే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ప్రసంగం లేకుండానే సభ వాయిదా పడటం గమనార్హం. చివరిరోజు కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. సభా సమయం వృఽథా కావటంపై రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆవేదన వ్యక్తంచేశారు.
తొలిసారి వందేమాతరంతో..
భారత పార్లమెంటు చరిత్రలో తొలిసారి లోక్‌సభ సమావేశాలు వందే మాతరం గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. వందేమాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న జాతీయ గౌరవ అవమాన నిరోధక బిల్లు-2026కు రాష్ట్రపతి బుధవారం ఆమోదం తెలపటంతో అది చట్టంగా మారింది. ఆ మరుసటి రోజే సభలో గీతం పూర్తిగా ఆరు చరణాలను వినిపించారు. ఆ సమయంలో ప్రధాని, మంత్రులు, విపక్ష నేత సహా సభ్యులంతా సభకు హాజరయ్యారు. సమావేశాలు చర్చ లేకుండానే ముగియటంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాట యుద్ధం నడిచింది. ఈ పరిస్థితికి విపక్ష నేత రాహుల్‌గాంధీయే కారణమని మంత్రులు రిజిజు, ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆయన అహంకారం వల్లే సభా సమయం వృథా అయ్యిందని విమర్శించారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కీలకమైన అంశాలపై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని ఆ పార్టీ నేత జైరాంరమేశ్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..