Share News

సమరమే..!

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:13 AM

లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్‌ వంటి కీలక బిల్లులను ఎట్టిపరిస్థితుల్లో నెగ్గించుకోవాలన్న ప్రభుత్వ పట్టుదల.. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌, అయోధ్య రామాలయంలో...

సమరమే..!

  • నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

  • వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమైన అధికార, విపక్షాలు

  • 5 కొత్త బిల్లుల ఆమోదమే లక్ష్యంగా కేంద్రం అడుగులు

  • డీలిమిటేషన్‌, మహిళా కోటా బిల్లుల ఆమోదానికీ వ్యూహాలు

  • బల సమీకరణకు విపక్ష రెబల్స్‌తోపాటు కొన్ని పార్టీలపై కన్ను

  • నీట్‌ పేపర్‌ లీక్‌, అయోధ్య విరాళాల చోరీ విపక్షాల అస్త్రాలు

  • పార్టీ ఫిరాయింపులపై సభను స్తంభింపజేసే ప్రణాళికలు

  • జైలుకెళ్తే పీఎం, సీఎంల పదవులు ఊడే బిల్లుపై జేపీసీ రిపోర్టు

  • దానిపైనా సభలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం

  • టీఎంసీ రెబల్స్‌ను పిలవటంపై అఖిలపక్ష భేటీ రసాభాస

  • సభను సజావుగా సాగనివ్వండి: మంత్రి కిరణ్‌ రిజిజు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్‌ వంటి కీలక బిల్లులను ఎట్టిపరిస్థితుల్లో నెగ్గించుకోవాలన్న ప్రభుత్వ పట్టుదల.. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, ఈ20 పెట్రోల్‌, పలు పార్టీలను చీల్చిన ఎంపీలకు వేరుకుంపటి గుర్తింపు తదితర అంశాలపై ప్రభుత్వం మెడలు వంచాలన్న ప్రతిపక్షాల వ్యూహాల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు 19 సిట్టింగులుగా నిర్వహించే ఈ సమావేశాలు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక, న్యాయ సంస్కరణల దిశగా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కారు పట్టుదలతో ఉండగా.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్ష ‘ఇండియా’ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో రూపాయి విలువను స్థిరపరచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గతంలో తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ఆదాయ పన్ను (సవరణ) బిల్లు- 2026ను ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచే సవరణ బిల్లుతోపాటు ఎంఎస్‌ఎంఈ డెవల్‌పమెంట్‌ సవరణ బిల్లు, జాతీయ గౌరవ భంగ నిరోధక సవరణ బిల్లు, జనన-మరణాల నమోదు సవరణ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జాతీయ గేయం ‘వందేమాతరం’ను అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై నేరంగా పరిగణించేలా రూపొందించిన ‘ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్‌ టు నేషనల్‌ హానర్‌ (సవరణ)-2026’ బిల్లు ను సమావేశాల తొలిరోజే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న ‘ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) సవరణ బిల్లు’ను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


బిల్లుల ఆమోదానికి వ్యూహాలు

లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌.. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33ు రిజర్వేషన్‌ బిల్లులను ఆమోదింపజేసుకొనేందుకు గత ఏప్రిల్‌లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మోదీ సర్కారుకు భంగపాటు ఎదురైన విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. తన చేతికి మట్టి అంటకుండా ప్రతిపక్ష కూటమిలోని పార్టీలను చీల్చి ఈ బిల్లుల ఆమోదానికి మద్దతు కూడగట్టే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెంది న 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఊరూ పేరూ తెలియని నేషనల్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)లో చేరారు. ఆ పార్టీ అధికార ఎన్డీయేకు మద్దతు ఇస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు ఎన్డీయే కూటమిలోని శివసేనలో చేరారు. వారికి లోక్‌సభ స్పీకర్‌ ‘అనుబంధ’ గుర్తింపు కూడా ఇచ్చేశారు. అంతకుముందే ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు ఎన్డీయే చేరువైందని అంటున్నారు. ఐదారు సీట్ల మద్దతు తక్కువ ఉన్నా.. విపక్ష కూటమిలోని ఎంపీలను ఆఖరి నిమిషంలో తమవైపు తిప్పుకొని బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ బిల్లులు సమావేశాల తొలిరోజు సభముందుకు రాబోవని అధికార వర్గాలు తెలిపాయి.


6-National.jpg

ప్రత్యేక సెషన్‌ స్ఫూర్తితో ప్రతిపక్షాలు..

ప్రభుత్వ దూకుడుకు ఎట్టి పరిస్థితుల్లో కళ్లెం వేయాలని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రత్యేక స మావేశాల్లో ఇండియా కూటమి నేతృత్వంలో విపక్ష పార్టీలన్నీ ఒక్కటై బిల్లులను అడ్డుకున్నాయి. అదే స్ఫూర్తితో ఈ సెషన్‌లోనూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించాయి. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, ఈ20 పెట్రోల్‌ తదితర అంశాలు విపక్షాలకు ప్రధాన అస్త్రాలుగా మారాయి. సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశమై ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నాయి. రాజకీయ ఫిరాయింపుల అంశం కూడా సభను కుదిపేేసలా కనిపిస్తోంది. మరో కీలక రిపోర్టు కూడా సభను కుదిపేసే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాల్లో అరెస్ట్‌ అయ్యి 30రోజులు జైల్లో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి పదవులను ఆటోమెటిక్‌గా కోల్పోయేలా రూపొందించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సమావేశాల్లో నే సభ ముందుకు రానుంది. విపక్షాల ప్రభుత్వాలను కూలదోసేందుకే ఈ బిల్లును తెచ్చారని ఆరోపి స్తూ దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై సభలో వివాదం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.


అఖిలపక్ష భేటీ రసాభాస

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలతో గుర్తింపులోకి వచ్చిన ఎన్‌సీపీఐని ఈ సమావేశానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ సమావేశాన్ని బహిష్కరించాయి. అయితే, తమ నిరసనను నమోదు చేసిన కొద్దిసేపటికే ఆ పార్టీల నేతలు తిరిగి సమావేశంలో పాల్గొన్నారు. టీఎంసీ రెబల్‌ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, అధికారికంగా విలీనానికి ఆమోదం లభించలేదని ప్రతిపక్షాలు వాదించాయి. పార్లమెంటు వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఆ 20 మందిని టీఎంసీ ఎంపీలుగానే చూపిస్తోందని విపక్ష నేతలు గుర్తుచేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి టీఎంసీ రెబల్‌ ఎంపీలకు ఎన్‌సీపీఐ ‘పార్కింగ్‌ ప్లేస్‌’లా మారిందని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ విమర్శించారు. కాగా, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అఖిలపక్ష భేటీలో మద్దతు ల భించిందంటూ వస్తున్న వార్తలు అబద్ధమని జైరాం రమేశ్‌ చెప్పారు. కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన కథ నాలన్నీ బోగస్‌ అని ‘ఎక్స్‌’లో ఆయన పేర్కొన్నారు.

సభా సమయం వృథా చేయొద్దు: కిరణ్‌ రిజిజు

సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. సభలో గందరగోళం సృష్టించడం కంటే దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపడమే ప్రజాస్వామ్యానికి బలమని అన్నారు. సభలో ఏకాభిప్రాయం కోసం అందరినీ సంప్రదించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంచేశారు. మరోవైపు అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించడం పట్ల ఎన్‌సీపీఐ పక్ష నేత కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 06:14 AM