హర్యానాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై బండరాయితో దాడి.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:11 PM
హర్యానాలోని పంచకులలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై మూడో తరగతి విద్యార్థి దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారిపై ఆ బాలుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఏకంగా పెద్ద బండరాయితో తలపై పలుమార్లు మోదాడు.
చండీగఢ్: హర్యానాలోని పంచకులలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాలలో బాలిక (6)పై మూడో తరగతి విద్యార్థి (8) దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారిని విచక్షణారహితంగా కొట్టడంతో పాటు పెద్ద బండరాయితో ఆమె తలపై పలుమార్లు మోదాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
పంచకులలోని సంస్కృతి మోడల్ స్కూల్లో అక్టోబర్ 28న బాలికపై విద్యార్థి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను ఓ తరగతి గదిలోకి ఈడ్చుకెళ్లి తలను బల్లకేసి బాదాడు. ఆ తర్వాత నేలపై పడేసి తన్నడం మొదలుపెట్టాడు. అనంతరం పెద్ద బండరాయితో పదేపదే కొడుతూ తీవ్రంగా గాయపరిచాడు. బాలుడి దాడితో స్పృహ కోల్పోయిన చిన్నారి రక్తపు మడుగులో పడిపోయింది. అయినప్పటికీ, ఏమాత్రం కనికరం చూపకుండా దాడిని కొనసాగించాడు. రాయితో పదేపదే ముఖం, తలపై కొట్టాడు. దాదాపు ఒకటిన్నర నిమిషాల తర్వాత తరగతి గది నుంచి అతను బయటకు వెళ్లిపోయాడు. ఇంత జరుగుతున్నా పాఠశాల విద్యార్థులు కానీ, సిబ్బంది కానీ ఈ ఘటనను గుర్తించలేదు. కాసేపటి తర్వాత బాలికను తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. అప్పుడు దాడి చేసిన బాలుడే వారిని ఆమె వద్దకు తీసుకెళ్లాడు. 'మీ కూతురు ఇక్కడ పడి ఉంది' అని చూపించాడు.
తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని తల్లిదండ్రులు సెక్టార్ 6లోని సమీప సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పీజీఐ చండీగఢ్‌కు రిఫర్ చేశారు. బాలికను హుటాహుటిన అక్కడికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంత చిన్న వయసులోనే బాలుడు ఇంతటి ఘోరానికి ఎందుకు పాల్పడ్డాడనే కోణంలో ఆరా తీశారు. ఈ మేరకు నిందితుడి తల్లిదండ్రులు, బంధువులను ప్రశ్నించారు. అయితే, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తానని బాలిక చెప్పడంతోనే అతను దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరోవైపు, బాలుడు గతంలోనూ దూకుడుగా ప్రవర్తించినట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ ఘటనపై హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, అంత చిన్న వయసులోనే బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై స్థానికులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయి.. సర్‌పై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ ప్రారంభం.. జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం..