Share News

ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ ప్రారంభం.. జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం..

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:07 PM

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా దీనిని ప్రారంభించారు.

ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ ప్రారంభం.. జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం..
Mock Parliament

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా దీనిని ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసంలో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నారు. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ సభాపతి పాత్ర పోషిస్తూ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. అలాగే కూటమి ముఖ్యమంత్రులూ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రజా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చ ముగింపులో ప్రసంగించనున్నారు. కాగా, దేశంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరుగుతోందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు నేడు మాక్ పార్లమెంట్‌ను నిర్వహిస్తున్నారు. మరోవైపు, దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ వాస్తవ రాజకీయాల్లో గెలవలేక, తనకు నచ్చిన పార్లమెంట్‌ను తానే ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయి.. సర్‌పై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

లండన్ నుంచి రహస్యంగా వచ్చి.. పుణెలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Updated Date - Oct 31 , 2026 | 05:26 PM