Share News

భారత నౌకను ఢీకొట్టిన పాక్ యుద్ధనౌక.. ఢిల్లీలో పాక్ దౌత్యవేత్తకు సమన్లు..

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:46 PM

అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొన్న ఘటనపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్య అధికారి సాద్ అహ్మద్ వర్రాయిచ్‌ను భారత విదేశాంగ శాఖ బుధవారం పిలిపించింది.

భారత నౌకను ఢీకొట్టిన పాక్ యుద్ధనౌక.. ఢిల్లీలో పాక్ దౌత్యవేత్తకు సమన్లు..
India Pakistan Navy collision

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన నౌక ఢీకొన్న ఘటనపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసేందుకు ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్య అధికారి సాద్ అహ్మద్ వర్రాయిచ్‌ను భారత విదేశాంగ శాఖ బుధవారం పిలిపించింది. పాకిస్థాన్ నౌకాదళం వ్యవహరించిన తీరు అంగీకరించలేనిదని, వృత్తిపరంగా సరికానిదని భారత్ పేర్కొంది (India Pakistan Navy collision).


ఈ ఘటన సెప్టెంబర్ 15 సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలో చోటుచేసుకుంది. ఒమన్‌కు సుమారు 220 కిలోమీటర్ల తూర్పున సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళ యుద్ధనౌకకు పాకిస్థాన్ నౌకాదళ నౌక అత్యంత సమీపంగా వచ్చింది. భారత వర్గాల ప్రకారం, పాకిస్థాన్ నౌక అధిక వేగంతో, సురక్షితం కాని రీతిలో దిశ మార్చుకుంటూ రావడంతో ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి భారీ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఢీకొన్న తర్వాత రెండు నౌకలు అక్కడి నుంచి విడిపోయినట్లు సమాచారం (Pakistani ship collides Indian Navy).


భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని తగిన జాగ్రత్తలు పాటించాలని పాకిస్థాన్ అధికారులకు తెలియజేయాలని భారత విదేశాంగ శాఖ పాక్ దౌత్యవేత్తకు సూచించింది (Indian Navy Pakistan incident). ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్త కూడా పాకిస్థాన్ విదేశాంగ శాఖకు ఇదే అంశంపై నిరసన తెలియజేయనున్నట్లు భారత్ తెలిపింది.


కాగా, భారత్-పాకిస్థాన్ నౌకాదళాల మధ్య ఇలాంటి ఘటన గతంలో కూడా చోటుచేసుకుంది. 2011లో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన పీఎన్ఎస్ బాబర్, భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ గోదావరిని ఢీకొట్టింది. ఆ సమయంలో గోదావరి హెలికాప్టర్ డెక్‌కు స్వల్ప నష్టం జరిగినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 16 , 2026 | 01:49 PM