పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ఎక్స్ వేదికగా భారత ఆర్మీ ట్వీట్..
ABN , Publish Date - Apr 21 , 2026 | 10:49 AM
జమ్ముకాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటికి సరిగ్గా ఏడాది కానుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా భారత ఆర్మీ స్పందించింది.
జమ్ముకాశ్మీర్: అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఓ స్థానికుడు సహా 25మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది. సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 100మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను పాక్ గడ్డపైనే మట్టుబెట్టింది. అలాగే ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఈ దాడికి పాల్పడిన వారినీ హతమార్చింది.
పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటి(22-04-2026)కి సరిగ్గా ఏడాది కానుంది. ఈ సందర్భంగా భారత సైన్యం దృఢ సంకల్పాన్ని, ఐక్యతను ప్రతిబింబించే ఓ శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చింది. 'మానవత్వపు హద్దులు దాటినప్పుడు, ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరుగుతుంది. భారతదేశం ఐక్యంగా నిలుస్తుంది' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి..
2025, ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లా పహల్గామ్ వద్ద మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్ పచ్చిక బయళ్ల ప్రాంతాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని ముగ్గురు ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగపడ్డారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా చిక్కిన వారిని చిక్కినట్లే కాల్చేశారు. వారిని అడ్డుకుంనేందుకు ప్రయత్నించిన ఓ స్థానికుడినీ హతమార్చారు. మెుత్తం 26 మంది ప్రాణాలను తీసి అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటన భారతదేశం సహా పలు దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాక్ ఉగ్రవాద చర్యను అనేక దేశాలు ఖండించాయి. దీంతో జమ్ముకాశ్మీర్ వ్యాప్తంగా సుమారు 44 పర్యాటక ప్రదేశాలను మూసివేశారు అధికారులు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. చివరికి దాడులు ఆపాలంటూ పాక్ కాళ్లబేరానికి వచ్చింది. కాగా, జమ్ముకాశ్మీర్ వ్యాప్తంగా చాలా పర్యాటక ప్రదేశాలు తిరిగి ప్రారంభించినప్పటికీ బైసరన్, చందన్‌వారి పర్యాటక ప్రదేశాలు ఇంకా మూసే ఉన్నాయి.
వరుస సమీక్షలు..
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్ముకాశ్మీర్ అధికారులు, పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు రేకెత్తకుండా భద్రతను పటిష్ఠం చేశాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పుల్వామా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జావేద్ ఇక్బాల్ మట్టూ భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అవంతిపోరా, శ్రీనగర్‌లలోనూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.వి.సందీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాద చర్యల నిర్మూలనపై సమీక్షలు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి
భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..
పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత