వృద్ధుడిని చుట్టేసిన పాము.. నాలుగు గంటల నరకం..
ABN , Publish Date - May 31 , 2026 | 01:43 PM
పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన ఓ వృద్ధుడిని విష సర్పం చుట్టేసింది. నాలుగు గంటల పాటు నరకం చూపించింది. ఈ సంఘటన ఒడిశాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
భువనేశ్వర్, మే 31: పక్షవాతంతో మంచానికి పరిమితం అయిన ఓ వృద్ధుడిని విష సర్పం చుట్టేసింది. నాలుగు గంటల పాటు నరకం చూపించింది. ఈ సంఘటన ఒడిశాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బౌధ్ జిల్లాలోని అదేనీఘర్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు అనే వృద్ధుడికి కొన్ని నెలల క్రితం పక్షవాతం వచ్చింది. పక్షవాతం కారణంగా సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎక్కువగా మంచానికే పరిమితమై ఉంటున్నారు. శనివారం రాత్రి ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఓ విష సర్పం కిటికీలోనుంచి సాహు నిద్రపోతున్న గదిలోకి ప్రవేశించింది. బెడ్‌పై నిద్రపోతున్న సాహు శరీరంపైకి చేరి అటు, ఇటు కదలసాగింది. సాహుకు మెలుకువ వచ్చింది. శరీరంపై ఉన్న పామును చూసి షాక్ అయ్యారు. పాము నుంచి తప్పించుకోవాలని చూసినా.. పక్షవాతం కారణంగా వేగంగా పక్కకు కదలలేకపోయారు. దీంతో కొద్దికొద్దిగా శరీరాన్ని పక్కకు జరపటం మొదలెట్టారు. సాహు కదలటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పాము ఆయన చేతిని చుట్టుకుంది. పాము నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడటంతో సాహు కదలకుండా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు ఆ రూము దగ్గరకు వచ్చారు.
సాహు చేతికి పాము చుట్టుకుని ఉండటం చూసి షాక్ అయ్యారు. పామును కదిలిస్తే అది సాహును కాటు వేసే ప్రమాదం ఉందని భావించారు. దానిని కదిలించే ప్రయత్నం చేయలేదు. దాదాపు నాలుగు గంటల పాటు పాము కదలికలను గమనించసాగారు. నాలుగు గంటల తర్వాత పామును పక్కకు వెళ్లగొట్టారు. నాలుగు గంటలు పాము సాహును చుట్టుకుని ఉన్నా కాటు వెయ్యలేదు. సాహు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్-2026 విజేత ఎవరు.. అశ్విన్ చెప్పిన జోస్యం ఏంటంటే..