Share News

600 మందికి ఎన్టీఏ ఉద్వాసన

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:13 AM

వరుసగా పరీక్ష పేపర్‌ లీకేజీలు, తప్పుల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలోనే దాదాపు 50 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన...

600 మందికి ఎన్టీఏ ఉద్వాసన

  • పేపర్‌ సెట్టింగ్‌ ప్యానల్స్‌ నుంచి తొలగింపు

  • వారి స్థానంలో త్వరలో కొత్త నిపుణుల నియామకం

  • ఇకపై ప్రశ్నపత్రాల తయారీలో నాలుగు దశల వడపోత

  • కేంద్ర విద్యాశాఖ మంత్రి సమీక్షలో ఎన్టీఏ డీజీ వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 18: వరుసగా పరీక్ష పేపర్‌ లీకేజీలు, తప్పుల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలోనే దాదాపు 50 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ.. తాజాగా పరీక్ష పేపర్ల సెట్టింగ్‌ ప్యానళ్లలోని 600 మంది సబ్జెక్టు నిపుణులను తొలగించినట్లు ప్రకటించింది. మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ ఈ విషయం వెల్లడించారు. వీరి స్థానంలో కొత్తవారిని ప్యానళ్లలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. సంస్థలోకి మరో 20-25 మంది అధికారులను కూడా నియమించుకోనున్నట్లు చెప్పారు. గత నెలలోనే కొందరు నిపుణులను ఎన్టీఏ రిక్రూట్‌ చేసుకుంది. గత జూన్‌లో నిర్వహించిన యూజీసీ-నెట్‌ పరీక్షల్లో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ పేపర్లలో అచ్చు తప్పులు, అన్వయ దోషాలు, తర్జుమాలో తప్పులు దొర్లినట్లు ఆరోపణలు రావటంతో ఆ మూడు పేపర్ల పరీక్షలను రద్దు చేశారు. ఇప్పటికే నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహంగా ఉన్న తరుణంలో ఈ పేపర్లు కూడా తప్పుల తడకగా రావటంతో ఎన్టీఏపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇకపై పరీక్ష పేపర్ల తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు నాలుగు దశల్లో లోతుగా పరిశీలన జరపాలని నిర్ణయించినట్లు అభిషేక్‌సింగ్‌ వెల్లడించారు. సబ్జెక్టు పరమైన తప్పులు, భాషా దోషాలు, ట్రాన్స్‌లేషన్‌ తప్పులు, ప్రశ్నల రూపకల్పనలో దొర్లే తప్పులను ఈ నాలుగు దశల్లో సరిదిద్దనున్నట్లు వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 06:50 AM