ఎన్‌ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:44 AM
ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్ఛేంజీ, దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది.
సెబీ గ్రీన్‌సిగ్నల్.. ఈ నెలలోనే ఇష్యూ, లిస్టింగ్ పూర్తి!..
దేశంలో ఇదే అతిపెద్ద ఆఫర్
ముంబై: ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్ఛేంజీ, దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది.ఎన్ఎస్ఈ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా ఎన్‌ఎస్‌ఈ తన పెయిడప్ క్యాపిటల్‌లో దాదాపు 6 శాతానికి సమానమైన 14.89 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ.30,000 కోట్ల వరకు సమీకరించనుంది. తద్వారా దేశంలో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలవనుంది. ఈ జూన్ 17న ఎక్స్ఛేంజీ.. ఐపీఓకు అనుమతి కోసం సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.
ఈ నెల 18న ఆఫర్ ప్రారంభం!?
ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్ రూ.37,700 కోట్ల ఐపీఓకు సైతం ఈ మధ్యనే సెబీ ఆమోదం లభించింది. అయితే, జియో ప్లాట్‌ఫామ్ ఎప్పుడు ఐపీఓకు వచ్చేది ఇంకా ప్రకటించలేదు. ఎన్‌ఎస్ఈ మాత్రం ఈ నెల 18న ఐపీఓను ప్రారంభించవచ్చని.. ఈ నెల 24 లేదా 25వ తేదీన షేర్లను మార్కెట్లో నమోదు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న ప్రారంభం కానున్న పితృపక్షాల కంటే ముందే ఐపీఓ, లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్‌ఎస్‌ఈ భావిస్తున్నట్లు వారు చెప్పారు. అంటే, క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.
లిస్టింగ్‌తో టాప్-10 కంపెనీల జాబితాలోకి..
పబ్లిక్ ఇష్యూ అనంతరం మార్కెట్లో షేర్ల నమోదుతో ఎన్‌ఎస్ఈ మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. తద్వారా ఎన్‌ఎస్ఈ దేశంలోని అత్యంత విలువైన పది కంపెనీల్లో ఒకటిగా అవతరించనుంది.
పదేళ్ల నిరీక్షణ
కో-లొకేషన్ కేసుతో పాటు నియంత్రణపరమైన అవరోధాల కారణంగా ఎన్‌ఎస్ఈ ఐపీఓ ప్రణాళిక దాదాపు దశాబ్దకాలంగా జాప్యమవుతూ వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఈ వివాదాన్ని సెబీతో రూ.1,500 కోట్లు చెల్లించి పరిష్కరించుకుంది. అలాగే, ఈ కేసులకు సంబంధించి ఎన్‌ఎస్ఈపై సెబీ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ వారంలోనే కొట్టివేసింది. తాజాగా సెబీ ఆమోదంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడబోతోంది.
పూర్తిగా ఓఎఫ్ఎస్ ద్వారానే..
ఎన్‌ఎస్ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ( ఓఎఫ్ఎస్) ద్వారానే జరగనుంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సహా ఎక్స్ఛేంజీలోని పలువురు వాటాదారులకు చెందిన షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో ఎన్‌ఎస్ఈ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలో 10.72 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ మాత్రం షేర్లను విక్రయించడం లేదు. ఎన్‌ఎస్ఈ దాదాపు 1.8 లక్షల మంది షేర్‌హోల్డర్లను కలిగి ఉంది. ఈ ఐపీఓ కోసం ఎన్‌ఎస్ఈ 20 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించుకుంది.
రూ.1,800 స్థాయిలో ధర!?
ఎన్‌ఎస్ఈ తన ఐపీఓ ధరల శ్రేణిని ఈ నెల 15న ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఇష్యూ ధరల శ్రేణి రూ.1,800 స్థాయిలో ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇవి కూడా చదవండి
భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి..
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్