Searching For Mobile Network: ప్రాణం తీసిన మొబైల్ నెట్‌వర్క్.. 17వ అంతస్తు నుంచి కిందపడి..
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:16 PM
అతడు ఉంటున్న ప్లాట్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య తలెత్తటంతో అవతలి వ్యక్తి వాయిస్ సరిగా వినిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అదుపుతప్పి 17వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కోసం వెతుకుతూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 17వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన అజయ్ గార్గ్ ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. సెక్టార్ 104లోని ఏటీఎస్ వన్ హంలెట్ సొసైటీలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
అతడు ఉంటున్న ప్లాట్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య తలెత్తటంతో అవతలి వ్యక్తి వాయిస్ సరిగా వినిపించలేదు. దీంతో మొబైల్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అదుపుతప్పి 17వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. నేలపై చలనం లేకుండా పడి ఉన్న అజయ్‌ని అక్కడి వారు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో అజయ్ పైనుంచి కిందపడ్డం వల్లే చనిపోయినట్లు తెలియవచ్చింది. అయితే, ఆయన మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ కోసం వెతుకుతూ కిందపడ్డాడా? లేక సూసైడ్ చేసుకున్నాడా? అన్నది తెలియరాలేదు. సరైన కారణం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. అక్కడ చిరుత సంచారం ఉంది..
అరుదైన రికార్డు.. విరాట్ సరసన చేరిన వార్నర్!