Share News

టిప్‌ అడగొద్దు

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:05 AM

క్యాబ్‌, ఆటో, బైక్‌... ఏదైనా రైడ్‌ బుక్‌ చేసుకునే క్రమంలోనే టిప్‌ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రవాణా సేవల అనుసంధానకర్తలను(క్యాబ్‌ అగ్రిగేటర్లను)...

టిప్‌ అడగొద్దు

  • రైడ్‌ బుక్‌ చేసే సమయంలో ఈ విధానానికి స్వస్తి చెప్పండి

  • క్యాబ్‌ అగ్రిగేటర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

  • డార్క్‌ పాటర్న్స్‌ వాడుతున్న ర్యాపిడోకు 10 లక్షల ఫైన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: క్యాబ్‌, ఆటో, బైక్‌... ఏదైనా రైడ్‌ బుక్‌ చేసుకునే క్రమంలోనే టిప్‌ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రవాణా సేవల అనుసంధానకర్తలను(క్యాబ్‌ అగ్రిగేటర్లను) ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం మాట్లాడుతూ, ‘ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోంది. ఇదో అన్యాయమైన వ్యాపార పద్ధతి. రైడ్‌ నిర్ధారణ కాకముందే అడ్వాన్స్‌ టిప్‌ని ప్రాంప్ట్‌ చేయడంపైనే జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టిప్‌ పే చేయకపోతే రైడ్‌ నిర్ధారణ కాదన్న భయాన్ని వినియోగదారుల్లో రేకెత్తిస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపిన తరువాత ఇలాంటి ‘బిల్ట్‌ ఇన్‌ వ్యవస్థ’ను తొలగించాలని రవాణా సేవల అనుసంధానకర్తలను ఆదేశించాం. టిప్‌ అనేది స్వచ్ఛందంగా ఇచ్చేది. రైడ్‌ పూర్తయిన తరువాత టిప్‌ అంశాన్ని వినియోగదారుని ఇష్టానికి వదిలేయాలి. ఊబర్‌, ఓలాపైన కూడా విచారణ కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా, కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ(సీసీపీఏ)... క్యాబ్‌, బైక్‌, ఆటో రవాణా సేవల అనుసంధానకర్తల ప్లాట్‌ ఫాంలపై లోతైన పరిశీలన జరిపింది. డైనమిక్‌ ప్రైసింగ్‌, ప్రీ రైడ్‌ టిప్పింగ్‌ పద్ధతులపై అధ్యయనం చేసింది. ఊబర్‌, ఓలా, ర్యాపిడో, నమ్మ యాత్రి ప్లాట్‌ ఫాంలకు నోటీసులు జారీ చేసింది. ప్రివెన్షన్‌, రెగ్యులేషన్‌ ఆఫ్‌ డార్క్‌ పాటర్న్స్‌ 2026 గైడ్‌లైన్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. డార్క్‌ పాటర్న్స్‌ పద్ధతులకు పాల్పడుతున్నందుకు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నందుకు, అనైతిక వ్యాపార పద్ధతులను అవలంభిస్తూ ముందస్తు టిప్‌ చెల్లించేలా వినియోగదారుడిని ప్రేరేపిస్తున్నందుకు ర్యాపిడో ప్లాట్‌ ఫాం యాజమాన్య సంస్థ రొప్పెన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.10 లక్షల అపరాధరుసుము విధించింది.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 06:05 AM