దేశంలో పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదు.. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ
ABN , Publish Date - Mar 26 , 2026 | 09:10 PM
ఆయిల్, గ్యాస్ కొరతపై పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశంలో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఇంధన అవుట్‌లెట్లలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 26: పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపి వేసింది. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉందంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో జనం పెట్రోల్ స్టేషన్‌లకు, గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఒక రకంగా దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ కొరతపై పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందించింది.
భారతదేశంలో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఇంధన అవుట్‌లెట్లలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని అంది. ప్రజలు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచార ప్రచారాలకు మోసపోవద్దని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ధరల పెరుగుదల, రేషన్ విధానం, వాహనాలకు ఆడ్-ఈవెన్ పరిమితులు, ఇంధన స్టేషన్ల మూసివేత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది.
కొన్ని దేశాలు ‘జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి’ని కూడా ప్రకటించాయని తెలిపింది. భారతదేశానికి అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 41 కంటే ఎక్కువ సరఫరాదారుల నుంచి.. హోర్ముజ్ జలసంధి ద్వారా ముందుగా వచ్చిన దానికంటే ఎక్కువ ముడి చమురు అందుకుంటోందని వెల్లడించింది. భారతీయ ఆయిల్ కంపెనీలు వచ్చే 60 రోజుల ముడి చమురు సరఫరా కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
పార్టీ మార్పుపై వివాదం.. హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం
అబుదాబిపై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి