అబుదాబిపై ఇరాన్ మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి
ABN , Publish Date - Mar 26 , 2026 | 08:30 PM
గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం 27వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా వెనకడుగు వేసినా.. ఇజ్రాయెల్ మాత్రం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌తో పాటు అరబ్ దేశాలపై కూడా ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు చేస్తోంది. గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు భారతీయుడు కాగా..
మరొకరిని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ది అబుదాబి మీడియా ఆఫీస్ ఈ సంఘటపై స్పందించింది. ఈ మేరకు గురువారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా బాలిస్టిక్ మిస్సైల్‌ను అడ్డుకుంది. ఈ నేపథ్యంలోనే శకలాలు మీద పడి ఇండియా, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు’అని పేర్కొంది. కాగా, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా మృతి చెందిన భారతీయుల సంఖ్య ఏడుకు చేరింది. ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్, డ్రోన్లను యూఏఈ ఏయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇప్పటి వరకు 372 బాలిస్టిక్ మిస్సైల్స్, 15 క్రూయిస్ మిస్సైల్స్, 1,826 యూఈవీలను యూఏఈ ఏయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది.
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
యుద్ధం విషయంలో వెనక్కు తగ్గిన ట్రంప్ ఇరాన్‌కు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఓ వైపు ఒప్పందం కోసం ప్రయత్నిస్తూనే.. బయటకు మరోలా మాట్లాడుతోందని ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యం కాకముందే సీరియస్‌గా వ్యవహరించడం మంచిదని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్