యువతరానికి బాధ్యతలు అప్పగించాలి!
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:26 AM
కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు తీసుకొచ్చింది. 65 మంది సభ్యుల జాతీయ కమిటీలో ఏకంగా 51 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది...
నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై రాజకీయ చర్చ
ఆయన తన ట్రస్టు గురించి మాట్లాడారని
కేంద్ర మంత్రి కార్యాలయం స్పష్టీకరణ
నాగ్‌పుర్, ఆగస్టు 25: కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు తీసుకొచ్చింది. 65 మంది సభ్యుల జాతీయ కమిటీలో ఏకంగా 51 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా త్వరలో మార్పులు ఉంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువతరానికి బాధ్యతలు ఇవ్వాలి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గడ్కరీ రాజకీయ భవిష్యత్తుపైనా పలు రకాల చర్చకు దారితీసింది. అయితే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల గురించి కాదని, తనకు సంబంధించిన లక్ష్మణ్‌రావ్ మన్కర్ ట్రస్టు విషయంలో చేశారని ఆయన కార్యాలయం ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది. ఈ ట్రస్టు ఆదివాసీ ప్రాంతాల్లో విద్యాలయాలు నడుపుతోంది. నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. తాను ఇకపై గతంలో మాదిరిగా ఎక్కువ పనిభారాన్ని మోయలేనని, యువతరానికి మరింత బాధ్యతను అప్పగించాలన్నారు. కొత్త తరానికి సీనియర్లు మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘నేను గత 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో నిరంతరాయంగా పనిచేస్తున్నాను. ఎన్నో ఒడిదుడుకులను చూశాను. అనేక అవార్డులు పొందాను. అయితే నేను ఇప్పుడు పెద్దగా సామాజిక సేవ చేయలేను. ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్లే అవకాశం కొత్త తరానికి ఇవ్వాలి’’ అని అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో గడ్కరీ రాజకీయాలకు తన రిటైర్‌మెంట్‌పై హింట్ ఇచ్చారా? లేక క్రియాశీల రాజకీయాల నుంచి మెల్లిగా తప్పకోవాలని భావిస్తున్నారా? అంటూ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో గడ్కరీ వ్యాఖ్యలపై ఆయన కార్యాలయం స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన ఇచ్చింది. గడ్కరీ వ్యాఖ్యలకు రాజకీయాలతో సంబంధం లేదని, ఆయన తాను స్థాపించిన లక్ష్మణ్‌రావ్ మన్కర్ ట్రస్టు భవిష్యత్తు నాయకత్వ బాధ్యతల గురించి నిర్దిష్టంగా మాట్లాడారని తెలిపింది. అయితే కొన్ని టీవీ చానళ్లు ఆ ప్రకటనను దాని అసలు సందర్భం నుంచి వేరు చేసి, ఒక రాజకీయ వ్యాఖ్యగా చూపిస్తున్నాయని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!