రాజధానుల నుంచి నగరాలను పాలించలేం
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:07 AM
నగరాలను రాష్ట్ర రాజధానుల నుంచి సమర్థవంతంగా పాలించడం సాధ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా తేల్చిచెప్పారు. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా తక్షణ నిర్ణయాలు తీసుకునే అధికారం, సామర్థ్యం నగర పాలక సంస్థలకే ఉండాలన్నారు.
నగర పాలక సంస్థలకే పూర్తి అధికారాలివ్వాలి
‘మేయర్-ఇన్-కౌన్సిల్’ వ్యవస్థను ప్రవేశపెట్టాలి
రాష్ట్రాలు నూతన మునిసిపల్ చట్టాలను తీసుకురావాలి
‘నేషనల్ అర్బన్ కాన్‌క్లేవ్’ ముగింపు సభలో నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా
న్యూఢిల్లీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): నగరాలను రాష్ట్ర రాజధానుల నుంచి సమర్థవంతంగా పాలించడం సాధ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా తేల్చిచెప్పారు. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా తక్షణ నిర్ణయాలు తీసుకునే అధికారం, సామర్థ్యం నగర పాలక సంస్థలకే ఉండాలన్నారు. దేశంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నగర పాలనా వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘వికసిత భారత్.. 2047’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే నగరాల ప్రణాళిక, పరిపాలన, ఆర్థిక మూలాల్లో విప్లవాత్మక మార్పులు రావలసి ఉందని చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ‘2వ జాతీయ అర్బన్ కాన్ క్లేవ్’ ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ జనాభా 2060 నాటికి సుమారు 165 కోట్లకు చేరి స్థిరీకరణ పొందుతుందని తెలిపారు. అయితే 2050 నాటికే దేశ జనాభాలో దాదాపు సగం మంది నగరాల్లోనే నివసిస్తారని, పట్టణ జనాభా ప్రస్తుతం ఉన్న 50 కోట్ల నుంచి 85 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ స్థాయి జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులు, గృహ నిర్మాణం, ప్రాథమిక సదుపాయాలు కల్పించాలంటే నగరాల పాలనా తీరు మారాల్సిందేనని స్పష్టం చేశారు.
‘మేయర్ - ఇన్ - కౌన్సిల్’ వ్యవస్థను ప్రవేశపెట్టాలి
2014 తర్వాత అర్బన్ రంగానికి ప్రాధాన్యం పెరిగిందని, బడ్జెట్ కేటాయింపులు 10 రెట్లు పెరిగాయని ఆయన గుర్తుచేశారు. స్మార్ట్ సిటీస్, అమృత్, పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ వంటి మిషన్లతోపాటు మెట్రో, బస్సు రవాణా వ్యవస్థల కోసం ఏకంగా రూ.3.7 లక్షల కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. అలాగే, 2025 - 26 బడ్జెట్‌లో రూ.లక్ష కోట్ల ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కేటాయించినట్లు వివరించారు. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మాస్టర్ ప్లానింగ్, తాగునీరు, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్ నిర్వహణ సహా మొత్తం 18 అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. నగర పాలన సమర్థవంతంగా సాగాలంటే నేరుగా ఎన్నికయ్యే మేయర్లు ఉండాలని, వారికి ఐదేళ్ల స్థిరమైన పదవీకాలం కల్పించాలని రాజీవ్ గౌబా సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం