Share News

బాంబు పేలుడు కేసు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు..

ABN , Publish Date - Jun 06 , 2026 | 06:52 AM

భాంగర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.

బాంబు పేలుడు కేసు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు..
NIA

కోల్‌కతా: భాంగర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. సౌకత్ మొల్లా పరారీలో ఉన్నాడని ప్రకటించిన గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు (మార్చి 19న) దక్షిణ 24 పరగణాల జిల్లా భాంగర్ పరిధి దక్షిణ బమునియాలో నాటు బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.


ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేతో సహా ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసింది. భంగర్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా సౌకత్ మొల్లాను అరెస్టు చేశామని, శనివారం కోర్టులో హాజరుపరుస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఉన్న మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక, దక్షిణ 24 పరగణాల జిల్లావ్యాప్తంగా మొల్లా నివాసంతో పాటు అతనికి సంబంధించిన పలు ప్రాంతాల్లో గురువారం నాడు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.


మౌఖాలి, బరుయిపూర్, సోనార్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. అదే రోజు బాంబు తయారీదారులను తయారీ కేంద్రానికి తరలించిన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సౌకత్ మెుల్లా అరెస్టు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా, కానింగ్ పూర్బ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2016, 2021 ఎన్నికల్లో సౌకత్ మొల్లా ఎమ్మెల్యేగా గెలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎలా?

జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది!

Updated Date - Jun 06 , 2026 | 07:06 AM