అనుమానాలుంటే రండి.. నివృత్తి చేస్తాం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:58 AM
మెగా డీఎస్సీ-2025లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగలేదు. అనర్హులెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
డీఎస్సీలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగలేదు
అనర్హులెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. అంతా మెరిట్, నిబంధనల ప్రకారమే ఎంపిక
రిజర్వేషన్ అమలు చేయొద్దంటే ఎలా?.. హారిజాంటల్ విధానం అర్థంకాకే అపోహలు
జీవో 77 ప్రకారమే రిజర్వేషన్.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్లు కాదు
స్పోర్ట్స్‌లో జెన్యూన్ సర్టిఫికెట్లే పరిగణనలోకి.. రావత్, కోన శశిధర్, ఎస్.భరణి స్పష్టీకరణ
అమరావతి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ‘మెగా డీఎస్సీ-2025లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగలేదు. అనర్హులెవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు’ అని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. మెరిట్, రిజర్వేషన్, క్రీడా నిబంధనల ప్రకారమే టీచర్ పోస్టులు భర్తీ చేసినట్టు స్పష్టం చేసింది. అయినా దీనిపై ఎవరికైనా అనుమానాలుంటే పాఠశాల విద్య కమిషనరేట్‌కు రావాలని, సందేహాలను నివృత్తి చేస్తామని ఆహ్వానించింది. డీఎస్సీపై వస్తున్న ఆరోపణలపై సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) స్పెషల్ సీఎస్ ఎస్‌ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ ఎస్.భరణి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమకు అన్యాయం జరిగిందని కొద్దికాలంగా ఆరోపిస్తున్న 34 మంది అభ్యర్థుల ర్యాంకులు, క్రీడా మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలును వివరించారు. వారికి ఎందుకు ఉద్యోగాలు రాలేదో స్పష్టంగా వివరించారు.
సుప్రీం ఆదేశాలతో హారిజాంటల్
‘గతంలో వర్టికల్ రిజర్వేషన్ విధానం అమల్లో ఉండేది. అందులో వంద పాయింట్లతో రోస్టర్ ఉంటుంది. దామాషా ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలవుతాయి. ప్రతి కేటగిరీకి రోస్టర్ ముందుగానే ఖరారు చేసి ఉంటుంది. అయితే ఇందులో రిజర్వ్‌డ్ అభ్యర్థి ఓపెన్ కోటాలో ఉద్యోగం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆ రిజర్వ్ కోటా వాస్తవంగా ఇవ్వాల్సిన రిజర్వేషన్ కోటా కంటే దాటిపోతోంది. దీనిపై సుప్రీంకోర్టులో 1995 నుంచి కేసులు విచారణ జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది. మహిళా, ఎక్స్ సర్వీ్‌సమెన్, దివ్యాంగులు, క్రీడా కేటగిరీల అభ్యర్థులకు కోటా దాటకుండా హారిజాంటల్ రిజర్వేషన్ అమలుచేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రాష్ట్రంలో 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్‌పై కేసులతో అది నిలిచిపోయింది. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్ అంశంపై కమిటీని నియమించింది. హారిజాంటల్ రిజర్వేషన్ విధానంపై కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. అందుకు అనుగుణంగా 2023 ఆగస్టు 2న జీవో 77 తీసుకొచ్చారు. దానిద్వారా హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో మహిళా, క్రీడా, ఎక్స్ సర్వీ్‌సమెన్, దివ్యాంగుల కోటాకు ఫిక్స్‌డ్ రోస్టర్ పాయింట్లు తొలగించారు. తొలుత మెరిట్ ఆధారంగా ఆయా కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ మెరిట్‌లో ఈ నాలుగు కేటగిరీలకు కేటాయించిన పోస్టులకు అభ్యర్థులు సరిపడ స్థాయిలో రాకపోతే... చివరి మెరిట్ అభ్యర్థుల స్థానంలో వారిని సర్దుబాటు చేస్తారు. సామాజిక రిజర్వేషన్ కోటాలకు వర్టికల్ విధానం అమలవుతుంది’ అని రావత్ వివరించారు.
కాల్ లెటర్లు ఎందుకు పంపారంటే..
‘వర్టికల్ రిజర్వేషన్‌లో ముందే నిర్దేశించినట్లుగా ఎవరి పోస్టు వారికి దక్కుతుంది. హారిజాంటల్‌లో మహిళా, క్రీడా, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ముందే రోస్టల్ లేకపోవడం వల్ల అవసరాన్ని బట్టి సర్దుబాటు జరుగుతుంది. మెగా డీఎస్సీలో అందరూ ఈ రూల్స్ ప్రకారమే ఎంపికయ్యారు. క్రీడా కోటాకు ఇప్పుడు ముందే రోస్టర్ లేకపోవడం వల్ల వారికి తొలి అవకాశం కల్పిస్తారు. చాలా మందికి ఇది అర్థంకాకపోవడం వల్ల అపోహలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ ఏ అనుమానం ఉన్నా పాఠశాల విద్య కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌కు రావొచ్చు. ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తాం. సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్లు పంపారు కాబట్టి ఉద్యోగం ఇవ్వాలని చాలా మంది అంటున్నారు. కాల్ లెటర్లు పంపితే ఉద్యోగం వచ్చినట్లు కాదని అందులోనే చాలా స్పష్టంగా పేర్కొన్నాం. కొందరి సర్టిఫికెట్లు సరిగా లేకపోవడం, ఒక్కరే రెండు మూడు పోస్టులకు ఎంపిక కావడం తదితర కారణాలతో 1:1 నిష్పత్తిని మించి కొందరిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. అంతేకానీ వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదు. అలాంటివారు.. తమను పిలిచారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పుడు అంటున్నారు. మెగా డీఎస్సీపై 33వేల గ్రీవెన్స్‌ను పరిష్కరించాం. ఇంకా ఎవరైనా వచ్చినా సందేహాలకు వివరణ ఇస్తాం’ అని కోన శశిధర్ వివరించారు.
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ధ్రువీకరించాకే..
‘క్రీడా కోటాలో అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇవ్వదు. సంబంధిత క్రీడా అసోసియేషన్లు సర్టిఫికెట్లు జారీచేస్తాయి. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని నోటిఫికేషన్‌లోనే పెట్టాం. అన్ని సర్టిఫికెట్ల జెన్యూనిటీని వాటిని జారీచేసిన అసోసియేషన్ల వద్ద ధ్రువీకరించిన తర్వాత మెరిట్ జాబితాలు ఇచ్చాం. 421 పోస్టులు ఇస్తే 382 పోస్టులే భర్తీ అయ్యాయి. అంతర్ జిల్లా క్రీడలను ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతర్ జిల్లా పోటీలతోనే స్టేట్ చాంపియన్‌షి్‌పలకు వెళ్తారు. వారికి ఇచ్చినా కూడా ఇంకా మొత్తం పోస్టులు భర్తీ కాలేదు. మొత్తం ప్రక్రియలో అర్హత లేని వారిని ఎంపిక చేయలేదు’ అని శాప్ ఎండీ ఎస్.భరణి తెలిపారు.
ర్యాంక్ సరే.. మరి రిజర్వేషన్?
మెరుగైన ర్యాంక్ వచ్చినా.. నిబంధనల వల్లే ఉద్యోగాలు రాలేదు
డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందని, మంచి ర్యాంకు వచ్చినా ఉద్యోగం రాలేదని కొందరు అభ్యర్థులు సోషల్ మీడియా, ఇతర వేదికల్లో పోస్టులు పెట్టారు. కొందరు మాజీ సీఎం జగన్‌ను కూడా కలిశారు. దీన్నిసాకుగా తీసుకుని జగన్ మీడియా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వంపై బురదచల్లుతోంది. తమకు ఉద్యోగాలు రాలేదని చెబుతున్న కొందరు అభ్యర్థులకు మెరుగైన ర్యాంకులు వచ్చిన మాట వాస్తవమే అయినా... రిజర్వేషన్ల ప్రక్రియ వల్లే వారు ఎంపిక కాలేదు. అలాగే వారి కంటే తక్కువ ర్యాంకు వచ్చిన కొందరికి టీచర్ పోస్టులు రావడమూ అక్రమం కాదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీల వారీగా మంజూరైన పోస్టులను బట్టి.. పురుష అభ్యర్థులతో పాటు మహిళా/క్రీడా/దివ్యాంగ/ఎక్స్ సర్వీ్‌సమెన్‌ను తప్పనిసరిగా ఎంపిక చేయాలి. డీఎస్సీలో ఈ ప్రక్రియనే అమలు చేశారు. డీఎస్సీలో తమకు ఉద్యోగాలు రాలేదని చెబుతున్న కొందరు అభ్యర్థుల ర్యాంకులు, వారు ఎంపిక కాకపోవడానికి గల కారణాలను ఓసారి పరిశీలిస్తే...
అభ్యర్థుల ఆరోపణలు-వాస్తవాలు
ఎం.ఏకాంబరం. చిత్తూరు జిల్లా. బీసీ-డీ. ర్యాంకు 125. సోషల్ స్టడీస్.
జిల్లాలో బీసీ-డీలో మొత్తం ఏడు పోస్టులున్నాయి. వాటిలో 5 పోస్టులు 116 ర్యాంకు వరకు భర్తీ అయ్యాయి. 125 ర్యాంకు వరకు జనరల్ మెరిట్ రాలేదు. ఆ తర్వాత రెండు పోస్టులు రిజర్వ్ కోటాలో అదే బీసీ-డీ ర్యాంకుల పీహెచ్ అభ్యర్థులతో భర్తీ చేశారు. 141, 911 ర్యాంకర్లతో పీహెచ్ కోటాలో భర్తీ చేశారు.
నాగవేణి అంకాని. విశాఖపట్నం జిల్లా. బీసీ-ఏ. ర్యాంకు 146. సోషల్ స్టడీస్.
జిల్లాలో బీసీ-ఏ కోటాలో 7 పోస్టులున్నాయి. 134 ర్యాంకు వరకు ఆరు పోస్టులు భర్తీ అయ్యాయి. ఏడో పోస్టు క్రీడా కోటా కింద హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో భర్తీ అయ్యింది. క్రీడా కోటా కింద కూడా అదే బీసీ-ఏ అభ్యర్థికి అవకాశం దక్కింది.
షేక్ నసీమూన్. కడప. బీసీ-ఇ. ర్యాంకు-43. బయాలజీ.
జిల్లాలో బీసీ-ఇలో రెండే పోస్టులున్నాయి. ఒకటి 4వ, మరొకటి 30వ ర్యాంకరుతో భర్తీ అయ్యాయి. ఇక్కడ 43వ ర్యాంకుతో ఉద్యోగం వచ్చే పరిస్థితే లేదు. మిగిలిన అభ్యర్థులు ఇతర పోస్టులకు వెళ్లినప్పుడు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు.
బండారు యమున. విశాఖపట్నం. బీసీ-డీ. ర్యాంకు-68. ఫిజికల్ సైన్స్.
జిల్లాలో బీసీ-డీలో 5 పోస్టులున్నాయి. 30 ర్యాంకు వరకు మెరిట్‌తో నాలుగు పోస్టులు భర్తీ అయ్యాయి. ఐదో పోస్టు క్రీడా కోటా కింద వి.మాధవి అనే బీసీ-డీ అనే అభ్యర్థికి దక్కింది.
ఎర్రిపల్లి శ్రావణ్‌కుమార్. విశాఖపట్నం. బీసీ-ఏ. ర్యాంకు-53, ఫిజికల్ సైన్స్.
జిల్లాలో బీసీ-ఏలో 4 పోస్టులున్నాయి. 31 ర్యాంకు వరకు రెండు పోస్టులు మెరిట్‌లో భర్తీ అయ్యాయి. 114 ర్యాంకు వచ్చిన మహిళా కోటా బీసీ-ఏ అభ్యర్థికి మూడో పోస్టు, 417 ర్యాంకు వచ్చిన పీహెచ్ కోటా అభ్యర్థికి నాలుగో పోస్టు దక్కాయి.
సమదం పృద్వీరాజు. జోన్-1. బీసీ-బీ. టీజీటీ-తెలుగు. ర్యాంకు 157.
జోన్-1లో బీసీ-బీలో ఐదు పోస్టులున్నాయి. 55, 65, 121, 127, 141 ర్యాంకర్లతో ఐదు పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక ఈ అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు.
ఇ.శ్రీనివాసులు. ప్రకాశం. బీసీ-డీ. ర్యాంకు-86. ఎస్జీటీ.
జిల్లాలో బీసీ-డీ కోటాలో 5 పోస్టులున్నాయి. 58 ర్యాంకు వరకు మెరిట్‌లో నాలుగు పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత 2660 ర్యాంకు వచ్చిన వెంకట వినయ్ అనే అభ్యర్థికి ఎక్స్ సర్వీ్‌సమెన్ కోటాలో ఉద్యోగం దక్కింది. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉండటం వల్ల శ్రీనివాసులుకు ఉద్యోగం రాలేదు.
టి.విజయలక్ష్మి. చిత్తూరు. ఓసీ. ర్యాంకు-644. ఎస్జీటీ.
జిల్లాలో ఓసీ పోస్టులు 350 ఉన్నాయి. 343 పోస్టులు మెరిట్‌తో భర్తీ అయ్యాయి. రెండు పోస్టులు పీహెచ్ కోటా, మరో రెండు క్రీడా, మూడు ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాలో భర్తీ అయ్యాయి. దీంతో 644 ర్యాంకరుకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు.
ఎం.జగదీశ్ నాయక్. కడప. ఎస్టీ. ర్యాంకు-363. ఎస్జీటీ- ఉర్దూ మీడియం.
జిల్లాలో ఎస్టీ కోటాలో 4 బ్యాక్‌లాక్ పోస్టులున్నాయి. రెండు జనరల్, రెండు మహిళా కోటా. 125, 197 ర్యాంకుల అభ్యర్థులకు రెండు ఉద్యోగాలొచ్చాయి. మిగిలిన రెండు పోస్టులు మహిళలకు దక్కాలి. అయితే మహిళలు లేనందున ఆ పోస్టులను పురుషులకు కన్వర్ట్ చేసి ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే దానిపై వెంటనే నిర్ణయం తీసుకోలేరు.
అనిగి దుర్గయ్య. తూర్పుగోదావరి. ఎస్టీ. క్రీడా కోటా. ఫిజికల్ ఎడ్యుకేషన్.
ఈ అభ్యర్థి దరఖాస్తు సమయంలో జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ పొందినట్లు వివరాలు సమర్పించారు. అయితే అతనికి 2002లో నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ ఉంది. ఆ విషయాన్ని దరఖాస్తులో పేర్కొనలేదు. డీఎస్సీ క్రీడా కోటా నోటిఫికేషన్‌లో దరఖాస్తు సమయంలో ఇచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. గోల్డ్ మెడల్ అని పెట్టకుండా, సిల్వర్ మెడల్ ఉందని పెట్టడంతో పరిగణనలోకి తీసుకోలేదు.
మహ్మమద్ షాబుద్దీన్. విశాఖపట్నం. బీసీ-ఇ. ర్యాంకు 904. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో బీసీ-ఇ కోటాలో 5 పోస్టులున్నాయి. ఈ అభ్యర్థి పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో తెలుగు సబ్జెక్టు చదవలేదు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుకు తెలుగు చదివి ఉండాలనే నిబంధన ఉంది. కానీ తెలుగు లేకపోవడంతో ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు.
ఇందిర కుమారి. కృష్ణా. ఎస్సీ-3. ర్యాంకు 134. సోషల్ స్టడీస్.
జిల్లాలో ఎస్సీ-3 కేటగిరీలో 10 పోస్టులున్నాయి. 127 ర్యాంకు వరకు 8 పోస్టులు భర్తీ అయ్యాయి. చివరి 2 పోస్టులు క్రీడా కోటాకు హారిజాంటల్ రిజర్వేషన్ విధానంలో కేటాయించారు. దీంతో ఆమెకు ఉద్యోగం రాలేదు.
టి.బాలకృష్ణ. తూర్పుగోదావరి. బీసీ-డీ. ర్యాంకు 134. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో బీసీ-డీ కోటాలో 14 పోస్టులున్నాయి. ఏడు పోస్టులు 95 ర్యాంకు వరకు మెరిట్‌తో భర్తీ అయ్యాయి. 4 పోస్టులు మహిళా కోటా అభ్యర్థులు, రెండు ఎక్స్ సర్వీ్‌సమెన్, ఒకటి క్రీడా కోటాతో భర్తీ చేశారు.
పి.లక్ష్మీభారతి. కడప. బీసీ-ఏ. ర్యాంకు-104. గణితం.
జిల్లాలో బీసీ-ఏ కోటాలో మూడు పోస్టులున్నాయి. 12 ర్యాంకు అభ్యర్థికి మొదటి పోస్టు దక్కింది. 264 ర్యాంకరుకు పీహెచ్ కోటాలో, ఆ తర్వాత మరో పోస్టు క్రీడా కోటాలో వెళ్లాయి.
నరసింహారావు. ప్రకాశం. ఎస్సీ-3. ర్యాంకు-76. బయలాజికల్ సైన్స్.
జిల్లాలో నాలుగు పోస్టులున్నాయి. 54 ర్యాంకు వరకు మూడు పోస్టులు భర్తీ అయ్యాయి. నాలుగోది ఎక్స్ సర్వీ్‌సమెన్ కోటాలో ఎంపిక చేశారు. నరసింహారావు ఆర్థో పీహెచ్ కోటాలో దరఖాస్తు చేశారు. అయితే వర్టికల్ రిజర్వేషన్‌లో ఆర్థో పీహెచ్ కోటా పోస్టు బీసీ-సీ అభ్యర్థికి అప్పటికే వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం కోటాలోని మొత్తం పోస్టులు ఏదోక కేటగిరీతో భర్తీ కావాలి. మొత్తంగా ఆ కోటా పోస్టులు నిండాయా లేదా అనేదే చూస్తారు.
రాణి కందుల. కృష్ణా. బీసీ-బీ. ర్యాంకు-196. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో బీసీ-బీ కోటాలో 11 పోస్టులున్నాయి. 9 పోస్టులు 140 ర్యాంకు వరకు మెరిట్‌లో భర్తీ అయ్యాయి. ఒక పోస్టు 168 ర్యాంకు సాధించిన లావణ్యకు మహిళా కోటాలో ఇచ్చారు. ఇంకొకటి క్రీడా కోటాలో కేటాయించారు.
పి.వీరవేణి. తూర్పుగోదావరి. బీసీ-ఏ. ర్యాంకు-302. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో బీసీ-ఏ కోటాలో 15 పోస్టులున్నాయి. 11 పోస్టులను 250 ర్యాంకు వరకు మెరిట్‌లో భర్తీ చేశారు. మరో రెండు పీహెచ్, ఒకటి ఎక్స్ సర్వీ్‌సమెన్, ఒకటి క్రీడా కోటాలో భర్తీ అయ్యాయి.
కె.శరత్‌బాబు. జోన్-2. ఎస్సీ-3. ర్యాంకు- 143. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జోన్-2లో రెండు పోస్టులు ఎస్సీ-3 కేటగిరీలో ఉన్నాయి. 100, 102 ర్యాంకులతోనే ఆ రెండు పోస్టులు భర్తీ అయిపోయాయి. 143 ర్యాంకు వచ్చిన శరత్‌బాబుకు ఉద్యోగం రావడం సాధ్యం కాదు.
కె.అనిల్‌కుమార్. శ్రీకాకుళం. ఎస్సీ-1. ర్యాంకు-166. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో ఒక్క పోస్టే ఎస్సీ-1 కేటగిరీలో ఉంది. అది అదే కేటగిరీకి చెందిన నాగరత్నం అనే అభ్యర్థితో క్రీడా కోటాలో భర్తీ అయ్యింది. ఉన్న ఒక్కటీ హారిజాంటల్ రిజర్వేషన్‌లో క్రీడా కోటాకు పోవడంతో ఉద్యోగం రాలేదు.
సీహెచ్.రాజ్‌కమల్. గుంటూరు. ఎస్సీ-2. ర్యాంకు-337. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో ఎస్సీ-2లో 11 పోస్టులున్నాయి. 100 ర్యాంకు వరకు 7 పోస్టులు భర్తీ అయ్యాయి. 200, 225, 273, 292 ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు మహిళా కోటాలో పోస్టులు దక్కాయి. 337 ర్యాంకు సాధించిన ఈ అభ్యర్థికి అసలు ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు.
పాకా సతీశ్. జోన్-2. ఎస్సీ-3. ర్యాంకు-288. ఫిజికల్ ఎడ్యుకేషన్.
ఈ అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఆ తర్వాత అతను సీఆర్‌పీగా ఉద్యోగం చేస్తూ సంబంధిత శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా బీపీఈడీ కోర్సు చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ఇది నిజమని తేలడంతో అతనికి ఉద్యోగం ఇవ్వలేదు.
జి.అంజినప్ప. అనంతపురం. ఎస్సీ-2. ర్యాంకు-342. సోషల్ స్టడీస్.
డీఎస్సీ నిబంధనల ప్రకారం 40శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంటేనే పీహెచ్ కోటాలోకి వస్తారు. 40శాతం దృష్టిలోపం వైకల్యం ఉందని దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత పీహెచ్ సర్టిఫికెట్‌ను మెడికల్ బోర్డుకు పంపారు. 30శాతం వైకల్యమే ఉందని తేలింది. దీంతో అతనికి ఉద్యోగం రాలేదు.
పి.ప్రతిభా తరణి. తూర్పుగోదావరి. బీసీ-బీ. ర్యాంకు-87. ఇంగ్లిష్.
సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. జిల్లాలో 9 పోస్టులు ఉండగా 14, 17, 60, 65, 69, 73, 74, 77, 82 ర్యాంకుల అభ్యర్థులకు మెరిట్ ప్రకారం ఉద్యోగాలొచ్చాయి. 87 ర్యాంకు వరకు అసలు ఉద్యోగాలకు అవకాశమే రాలేదు.
ఎస్.షర్మిల. చిత్తూరు. బీసీ-ఇ. ర్యాంకు-110. బయలాజికల్ సైన్స్.
జిల్లాలో 2 పోస్టులు బీసీ-ఇ కేటగిరీలో ఉన్నాయి. 108 ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఒక పోస్టు ఇచ్చారు. 426 ర్యాంకు సాధించిన మరో అభ్యర్థికి పీహెచ్ కోటాలో ఉద్యోగం లభించింది. దీంతో ఆమెకు ఉద్యోగం రాలేదు.
యు.శ్రీదుర్గ మల్లిక. తూర్పుగోదావరి. ఓసీ- ఈడబ్ల్యూఎస్. ర్యాంకు-462. ఫిజికల్ ఎడ్యుకేషన్.
జిల్లాలో 20 పోస్టులున్నాయి. 16 పోస్టులు మెరిట్‌లో 346 ర్యాంకు వరకు భర్తీ అయ్యాయి. ఒక పోస్టు ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. ఆ తర్వాత మహిళా కోటాలోనే 414, 422, 445 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలొచ్చాయి. కాగా మొదట కేటాయించిన పోస్టుల్లో ఒక ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థి సర్టిఫికెట్ అనర్హమైందని తుది ఎంపిక జాబితా ప్రకటించిన తర్వాత తేలింది. దాంతో ఆ ఖాళీ అయిన పోస్టు తనకు కేటాయించాలని ఆమె కోరుతున్నారు. నిబంధనల ప్రకారం వీలు కాదు.