Share News

10 నిమిషాల్లో రాకపోతే.. రూ.10 వేల జరిమానా..

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:38 AM

జాతీయ రహదారులపై అంబులెన్సులు ప్రమాద ఘటనా స్థలికి 10 నిమిషాల్లోపు చేరుకోవాలి. టికెట్‌ అంగీకరించిన క్షణం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి..

10 నిమిషాల్లో రాకపోతే.. రూ.10 వేల జరిమానా..

  • అంబులెన్స్‌లకు సైరన్‌

  • గోల్డెన్‌ అవరైన గంటలోపు క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చాలి

  • ఆలస్యమైనా, వెళ్లడానికి నిరాకరించినా జరిమానా తప్పదు

  • అంబులెన్సులకు ఎన్‌హెచ్‌ఏఐ కొత్త నిబంధనలు

  • హైవేలపై సేవల్లో ఉన్న 3 వేల అంబులెన్స్‌లకు వర్తింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: జాతీయ రహదారులపై అంబులెన్సులు ప్రమాద ఘటనా స్థలికి 10 నిమిషాల్లోపు చేరుకోవాలి. టికెట్‌ అంగీకరించిన క్షణం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీటిలో ఏది జరగకపోయినా రూ.10 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నూతన పాలసీ గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 1033కి కాల్‌ వచ్చిన తరువాత ఘటనా స్థలానికి సమీపంలోని అంబులెన్సులకు ఎమర్జెన్సీ అలర్ట్‌ వెళ్తుంది. దానిని ఆ అంబులెన్స్‌ అంగీకరించాలి. తిరస్కరిస్తే అంతేమొత్తంలో జరిమానా చెల్లించాలి. అంగీకరించిన క్షణం నుంచి 10 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. లేకుంటే జరిమానా తప్పదు. వెళ్లాల్సిన ప్రాంతం 10 కి.మీ.కు మించి ఉంటే జీపీఎస్‌ రికార్డులను అనుసరించి దామాషా ప్రకారం సమయాన్ని ఇస్తారు. టికెట్‌ అంగీకరించాక గంటలోపు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆలస్యమైతే పదివేల రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా 3000 అంబులెన్సులు సేవలందిస్తున్నాయి. అంబులెన్సుల్లో అత్యవసర వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది ఉండాలి. కొరత ఉంటే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సిందే. ఎన్‌హెచ్‌ఏఐ కేర్‌ సిస్టమ్‌ సమర్థంగా పనిచేసేందుకు వాహనాలన్నింటికీ ఏఐఎస్‌-140 ప్రామాణికానికి అనువైన జీపీఎస్‌ పరికరం అమర్చి ఉంటుంది. ప్రతి వాహనానికీ డెడికేటెడ్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌, ఐఓటీతో కూడిన సిమ్‌ సౌకర్యం కల్పించినట్లు రహదారుల సంస్థ పేర్కొంది. ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు ఆలస్యమవుతున్న విషయాన్ని సుప్రీం కోర్టు రోడ్డు భద్రతా కమిటీ, కాగ్‌ నిర్వహించిన ఆడిట్‌ కూడా గుర్తించాయి. సవరించిన నూతన పాలసీ నిబంధనలను అమలు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్లకు, ప్రాంతీయ అధికారులకు ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. ఇక నుంచి డంపర్లు, టిప్పర్లు పై భాగంలో కప్పును కలిగి ఉండడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:30 AM