పంజాబ్‌లో మరో దారుణం.. భర్త కళ్ల ముందే భార్యపై కాల్పులు..
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:29 PM
పంజాబ్ రాష్ట్రంలోని తార్న్ తరన్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన మహిళపై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. భర్త కళ్ల ముందే ఆమెను కాల్చాడు..
ఇంటర్‌నెట్ డెస్క్: లా కాలేజ్ ఘటన మరువక ముందే పంజాబ్ రాష్ట్రంలోని తార్న్ తరన్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన మహిళపై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. భర్త కళ్ల ముందే ఆమెను కాల్చాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. తార్న్ తరన్ జిల్లాలోని పట్టికి చెందిన రూబీ అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన అన్ష్ గ్రోవర్‌తో రెండు నెలల క్రితం పెళ్లైంది. శనివారం సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ స్కూటర్ మీద మార్కెట్‌కు బయలు దేరారు. స్కూటర్ గేటు దాటిన కొన్ని క్షణాల్లోనే కరణ్ అనే వ్యక్తి బైకుపై వారిని అడ్డుకున్నాడు.
బైక్ పైనుంచి కిందకు దిగగానే అన్ష్‌పై దాడి చేశాడు. రూబీ అడ్డుకోవటానికి ప్రయత్నించింది. అయినా అతడు మాత్రం దాడి చేయటం ఆపలేదు. ఈ నేపథ్యంలోనే రూబీ.. కరణ్ నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో అతడు ఆమెను వెంబడించాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న తుపాకితో అన్ష్ కళ్లముందే ఆమెపై కాల్పులు జరిపాడు. ఇది చూసి భయపడిపోయిన అన్ష్.. ప్రాణ భయంతో అక్కడినుంచి పారిపోయాడు. కరణ్ విచక్షణా రహితంగా పలుమార్లు రూబీపై కాల్పులు జరిపాడు. తర్వాత బైక్‌పై అక్కడినుంచి వెళ్లిపోయాడు.
తీవ్రంగా గాయపడ్డ రూబీని కుటుంబసభ్యులు హుటాహుటిన పట్టిలోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రూబీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి డాక్టర్లు గురు నానక్ దేవ్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుటుంబసభ్యులు ఆమెను గురు నానక్ ఆస్పత్రికి తరలించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కరణ్ కోసం గాలిస్తున్నారు. కరణ్ రూబీపై కాల్పులు జరపడానికి గల కారణం ఏంటో తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి..
నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకూ అనుమతి లేదు: కేటీఆర్
తెలంగాణ ఎడ్‌సెట్ 2026: ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..