కొత్తగా ఓటరు నమోదుకూ సర్
ABN , Publish Date - Jul 13 , 2026 | 06:04 AM
ఇకపై కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫామ్-6తోపాటు గత సర్(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే)లో తన లేదా తల్లిదండ్రుల ఓటు వివరాలను తప్పనిసరిగా...
ఆన్‌లైన్ ఫామ్-6లో అదనపు డిక్లరేషన్
గత సర్‌లోని తన లేదా తల్లిదండ్రుల వివరాలను వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ, జూలై 12: ఇకపై కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫామ్-6తోపాటు గత సర్(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే)లో తన లేదా తల్లిదండ్రుల ఓటు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు సవరించిన ఫామ్-6 దరఖాస్తులను ఎన్నికల సంఘం(ఈసీ) ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టింది. దీనికోసం ఫామ్-6 ఆన్‌లైన్ వెర్షన్‌లో అదనపు డిక్లరేషన్‌ను చేర్చింది. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేందుకు, అనర్హుల పేర్లు తొలగించేందుకు ఈసీ ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. సర్ ప్రక్రియ పూర్తయిన 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.58 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగించే అవకాశం ఉంది. గత సర్‌లోని వివరాల ఆధారంగానే అనర్హుల పేర్లను తొలగించారు. తాజాగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారికీ గత సర్ వివరాలను ఈసీ తప్పనిసరి చేసింది. 2025-26లో సర్ ప్రక్రియ పూర్తయిన, లేదా ప్రస్తుతం సర్ ప్రక్రియ కొనసాగుతున్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల్లో(ఫామ్-6) అదనపు డిక్లరేషన్ కనిపిస్తోందని ఒక ఆంగ్ల పత్రిక తాజా కథనంలో వెల్లడించింది. కానీ, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు ఈసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ఫామ్-6లో మాత్రం ఈ డిక్లరేషన్ లేదని పేర్కొంది.
డిక్లరేషన్‌లో మూడు ఆప్షన్లు..
గత సర్ సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో నా పేరు ఉంది.
గత సర్ సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో నా తల్లిదండ్రులు, తాతా-మామ్మలలో ఒకరి పేరు ఉంది.
గత సర్ సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో నా పేరుగానీ, నా తల్లిదండ్రులు, తాతా-మామ్మల పేర్లుగానీ లేవు.
ఈ మూడు ఆప్షన్లను అదనపు డిక్లరేషన్‌లో ముద్రించారు. వీటిలో మొదటి రెండు ఆప్షన్లు ఎంచుకున్న దరఖాస్తుదారులు గత సర్‌లో సంబంధిత వ్యక్తి అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబరు, సీరియల్ నంబరు వివరాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలేమీ లభ్యంకాని పక్షంలో మూడో ఆప్షన్‌ను ఎంచుకోవాల్సిందే. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ అదనపు డిక్లరేషన్‌ను భర్తీ చేయడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు