నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్న 21 మంది భారతీయులు
ABN , Publish Date - Aug 28 , 2026 | 05:47 PM
నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 21 మంది భారతీయులు సురక్షితంగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా వారి స్వస్థలం తమిళనాడు చేరుకున్నారని వివరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 28: నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 21 మంది భారతీయులు సురక్షితంగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా వారి స్వస్థలం తమిళనాడు చేరుకున్నారని వివరించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నేపాల్‌లోని త్రిశూలి హైడ్రో పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న 63 మంది భారతీయులను కూడా రక్షించారని తెలిపారు.
అయితే నేపాల్ వరదలకు 320 మంది భారతీయులు, 100 మంది ఎన్నారైలు గల్లంతయ్యారని చెప్పారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి వీరంతా గల్లంతయ్యారని పేర్కొన్నారు. అయితే చైనా వైపు టిబేట్‌లో 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని అన్నారు. వారందరితో భారత రాయబార కార్యాలయం సంబంధాలు కలిగి ఉందని తెలిపారు. త్వరలో వారందరూ భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.