పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:09 PM
'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
ఆంధ్రజ్యోతి, జూన్ 21: 22 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన 'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ముగిసింది. మే 3న జరిగిన పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు, దర్యాప్తు నేపథ్యంలో రద్దయిన 'నీట్-యూజీ' (NEET-UG) ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇవాళ దేశవ్యాప్తంగా, విదేశాల్లో తిరిగి నిర్వహించింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది.
గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎన్‌టీఏ భద్రతను మరింత కఠినతరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టడానికి 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా 95,000 గదుల్లో 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటి లైవ్ ఫీడ్‌ను జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అధికారులు నిరంతరం వీక్షించారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం పోలీసులు డ్రోన్లను కూడా ఉపయోగించారు.
కోల్‌కతా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, తన కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ నిలిచిపోయి విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మధ్యాహ్నం 1 గంట నుంచి విమానాశ్రయంలోనే వేచి చూశారు. అలాగే ముంబైలో బస్సు కార్మికుల సమ్మె నడుస్తున్నప్పటికీ, విద్యార్థుల కోసం బెస్ట్ (BEST) సంస్థ 60 ప్రత్యేక బస్సులను నడిపింది. కోల్‌కతాలో భారీ వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచినప్పటికీ విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సృష్టి దూబే అనే విద్యార్థిని కోసం ఎన్‌టీఏ ప్రత్యేక గదిని, అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది. ఢిల్లీతో పాటు దాదాపు అన్ని కేంద్రాల బయట వేచి ఉన్న తల్లిదండ్రుల కోసం ఉచిత మంచినీరు, అల్పాహార సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
లేటుగా రావడం వల్ల నో ఎంట్రీ:
భోపాల్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రథమ చికిత్స చేయించుకుని కొద్దిగా ఆలస్యంగా వచ్చిన అమీర్ ఖాద్రీ అనే విద్యార్థిని అధికారులు లోపలికి అనుమతించలేదు. పరీక్ష అప్పటికే ప్రారంభం కావడంతో నిబంధనల ప్రకారం అనుమతి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో కుల్సుమ్ బానో అనే విద్యార్థిని బురఖా ధరించి రావడంతో తొలుత అనుమతించలేదనే వార్తలు వచ్చాయి. తన గుర్తింపు, సంప్రదాయమే ముఖ్యమని ఆమె వాదించగా, అనంతరం ఎన్‌టీఏ జోక్యం చేసుకుని ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించినట్లు స్పష్టం చేసింది.
మొత్తంమ్మీద, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు (దివ్యాంగులకు సాయంత్రం 6:20 వరకు) జరిగిన ఈ పరీక్ష ఇంగ్లీష్‌తో పాటు 12 భారతీయ భాషల్లో పరీక్ష విజయవంతంగా ముగిసింది.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..