నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడి అరెస్టు..
ABN , Publish Date - May 15 , 2026 | 07:54 PM
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ పి.వి.కులకర్ణిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడిని పుణెకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ పి.వి.కులకర్ణిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడిని పుణెకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరఫున పరీక్ష ప్రక్రియలో కొన్నేళ్లుగా కులకర్ణి పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశ్నపత్రాలను పొందే అవకాశం ఆయనకి దొరికింది. ఏప్రిల్ చివరి వారంలో మరో నిందితురాలైన మనీషా వాఘ్మారే సహాయంతో పేపర్ లీక్ కుట్రకు పాల్పడినట్లు సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు.
మహారాష్ట్రలోని పుణెలో తన నివాసంలో ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులను కులకర్ణి నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మనీషా సహాయంతో పలువురు విద్యార్థులను సమీకరించి వారికి రహస్యంగా కోచింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నీట్ ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఆరోపించారు. ఈ తరగతుల్లోనే ప్రశ్నలు, సరైన జవాబులను విద్యార్థులకు చెప్పారని అధికారులు తెలిపారు. ఆ ప్రశ్నలు మే 3న నిర్వహించిన అసలు నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రాల్లో వచ్చాయని వెల్లడించారు. దీంతో మే 14న మనీషాను అరెస్టు చేయగా.. నేడు కులకర్ణిని అరెస్టు చేశారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది. వారిలో ఐదుగురిని ఇప్పటికే కోర్టులో హాజరుపర్చగా.. ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. గురువారం అరెస్టయిన మిగిలిన ఇద్దరు నిందితులను ట్రాన్సిట్ రిమాండ్ నిమిత్తం పుణెలోని కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం ఆ ఇద్దరినీ ఢిల్లీకి తరలించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్.. ఆరుగురి మృతి
నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం