నీట్ విద్యార్థుల అగచాట్లు
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:53 AM
ఈ నెల 21వ తేదీన తిరిగి నిర్వహించనున్న నీట్-యూజీ పరీక్ష అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్ ప్రక్రియలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అడ్మిట్‌కార్డులు నీట్ వెబ్‌సైట్‌లో
అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌లో సమస్యలు.. ఫీజు రీఫండ్‌లోనూ ఇబ్బందులు
సోషల్ మీడియాలో భారీగా ఫిర్యాదులు
పరిష్కరిస్తున్నామన్న ఎన్‌టీఏ
న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జూన్ 15: ఈ నెల 21వ తేదీన తిరిగి నిర్వహించనున్న నీట్-యూజీ పరీక్ష అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్ ప్రక్రియలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అడ్మిట్‌కార్డులు నీట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆ పరీక్షను నిర్వహించే ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ) ఆదివారం ప్రకటించగానే.. విద్యార్థులు భారీ సంఖ్యలో వెబ్‌సైట్‌ను సందర్శించారు. అయితే, పోర్టల్ తెరుచుకోవటానికి చాలా సమయం పడుతోందని, మధ్యలోనే నిలిచిపోతోందని, టైమ్‌ఔట్ ఎర్రర్స్‌ని చూపిస్తోందని అనేక మంది సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, పరీక్షకు మళ్లీ సన్నద్ధం కావటంలో ఇప్పటికే తాము తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటే.. ఈ సమస్యలు ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. అడ్మిట్‌కార్డుల విషయంలో ఈ పరిస్థితి ఉంటే.. ఫీజు రిఫండ్ అంశంలోనూ సమస్యలు తలెత్తాయని తెలిపారు. రిఫండ్ కోసం తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించిన తర్వాత కూడా.. వివరాలు ఇవ్వలేదంటూ వెబ్‌సైట్‌లో కనిపించిందని పలువురు వెల్లడించారు. మరికొందరు, తమకు తెలియకుండా.. రిఫండ్ అవసరం లేదనే ఆప్షన్‌ను సెలక్ట్ చేశామని, రిఫండ్ కోసం ఈ ఆప్షన్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించాలని ఎన్‌టీఏకు విజ్ఞప్తులు చేశారు. అడ్మిట్‌కార్డుల కోసం ప్రత్యామ్నాయ విధానాలను కూడా అందుబాటులో ఉంచాలని, బ్యాంకుఖాతాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని పలువురు ఎన్‌టీఏకు సూచించారు. కాగా, ఈ ఫిర్యాదులపై ఎన్‌టీఏ సోమవారం స్పందిస్తూ.. విద్యార్థులు భారీ సంఖ్యలో సందర్శించటం వల్ల తమ సర్వర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దటానికి నిపుణులు పని చేస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే 4 లక్షల మంది విద్యార్థులు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపింది.
హ్యాకింగ్‌తో రీఫండ్‌ల చోరీ
పేపర్ లీకేజీ, తిరిగి పరీక్ష నిర్వహణ నేపథ్యంలో నీట్ విద్యార్థులకు ఫీజును రిఫండ్ చేస్తామని ఎన్‌టీఏ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా.. ఓ సైబర్ నేరస్థుడు రిఫండ్‌ల మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించుకున్నాడు. బిహార్‌లోని గయ జిల్లాకు చెందిన 19 ఏళ్ల నవీన్ యాదవ్ అనే వ్యక్తి నీట్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 150 మంది విద్యార్థుల అకౌంట్లను హ్యాక్ చేశాడు. రిఫండ్ కోసం ఆయా విద్యార్థులు ఇచ్చిన బ్యాంకు ఖాతాల వివరాల స్థానంలో తన బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేశాడు. తద్వారా ఒక్కో విద్యార్థికి రూ.1700 చొప్పున వచ్చిన రిఫండ్ మొత్తాన్ని తన ఖాతాకు మళ్లించాడు. దీనిపై ఓ విద్యార్థి తండ్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటపడింది. నవీన్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, నీట్ రీఎగ్జామ్ ప్రశ్నపత్రాలను అమ్ముతామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో బేరసారాలు సాగిస్తున్న రాజస్థాన్‌కు చెందిన సుమేర్‌సింగ్ మీనా, ఆకాశ్‌మీనా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రాం ఛానళ్ల ద్వారా వీరు నీట్ ప్రశ్నపత్రాల గురించి ప్రచారం చేశారని, రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు జరిపారని వెల్లడైంది.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!