బొద్దింకలు హిట్
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:10 AM
‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమిప్పితే లోకమే మారిపోదా.. ఈ చీకటే మాసిపోదా’.. అన్నట్లుగా భారతదేశ యువత తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. కేవలం రెండున్నర నెలల ...
దిగొచ్చిన మోదీ సర్కార్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం
విద్యార్థులపై ఢిల్లీలో, రాష్ట్రాల్లో నమోదైన కేసుల విత్‌డ్రా
భవిష్యత్తులోనూ వారి మీద ఎటువంటి చర్యలుండవు: నడ్డా
ఉద్యమం నిలిపివేత.. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ
పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై త్వరలో ప్రభుత్వంతో
చర్చిస్తాం: సీజేపీ ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్
జస్టిస్ సూర్యకాంత్‌కు కృతజ్ఞతలు.. ఆయన
‘బొద్దింకల’ వ్యాఖ్యవల్లే ఇది సాధ్యమైంది: అభిజిత్ దీప్కే
జంతర్‌మంతర్‌లో కన్నీళ్లు, కరచాలనాలతో భావోద్వేగాలు
ఎప్పుడూ మొబైల్‌లోనే ఉండే యువత మార్పు తెచ్చింది! సోషల్ మీడియాకే పరిమితమనుకున్న జెన్‌జీ సామాజిక సంచలనం సృష్టించింది! నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయ తీరాలకు చేరింది!!
న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమిప్పితే లోకమే మారిపోదా.. ఈ చీకటే మాసిపోదా’.. అన్నట్లుగా భారతదేశ యువత తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. కేవలం రెండున్నర నెలల వయసున్న పసికూన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సారథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కటైన విద్యార్థులు, యువత డిమాండ్ మేరకు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. మరో రెండు డిమాండ్లు.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం, విద్యార్థుల మీద నమోదైన కేసుల ఉపసంహరణకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. దీంతో 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ కేంద్రంగా నడుపుతున్న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా సీజేపీ ప్రకటించింది. నీట్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ విద్యార్థులు ససేమిరా అనడంతో చివరకు ప్రభుత్వమే దిగివచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని, ఆ డిమాండ్‌ను 72 గంటల్లో అంగీకరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 20వ తేదీ నాటి ‘చలో పార్లమెంటు’ ర్యాలీని మించిన ర్యాలీ జరుపుతామని సీజేపీ శుక్రవారం హెచ్చరించిన నేపథ్యంలో.. ఇక ఎంతమాత్రం జాప్యం చేయటానికి వీల్లేదని గ్రహించి అన్ని డిమాండ్లనూ ఆమోదించింది. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సీజేపీ ప్రతినిధులతో మంత్రుల చర్చలు ప్రారంభం కావడానికి గంట ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే శారు. అనంతరం, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్‌దాస్ శనివారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు.
చర్చల అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అన్ని డిమాండ్లనూ ప్రభుత్వం అంగీకరించిందని, ప్రభుత్వం పట్ల విశ్వాసంతో తాము ఉద్యమాన్ని విరమిస్తున్నామని అశుతోష్ తెలిపారు. నిరసన ప్రాంతాల నుంచి శాంతియుతంగా వెనక్కి వెళ్లిపోవాలని అందరినీ కోరుతున్నామని పిలుపునిచ్చారు. సౌరవ్‌దాస్ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు సంబంఽధించి తాము రూపొందించిన అయిదు సూత్రాల చార్టర్‌ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని, నాలుగు వారాల తర్వాత మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని చెప్పారు. విద్యార్థులపై క్రూరంగా లాఠీచార్జి చేసిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలనుంచి క్షమాపణను కూడా తాము కోరినట్లు తెలిపారు. అనేక ఇతర అంశాలపై తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వంతో తమ డిమాండ్లకు సంబంఽఽధించి కుదిరిన ఒప్పందంపై ముసాయిదాను రూపొందించామని, మంగళవారం నాటికి ఈ ఒప్పందాన్ని అఽధికారికంగా పంచుకుంటామని ప్రభుత్వం తమకు చెప్పినట్లు సౌరవ్‌దాస్ పేర్కొన్నారు. జేపీ నడ్డా మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు గౌరవనీయమైన పరిహారం అందజేస్తామని తెలిపారు. రూ.కోటి చొప్పున ఇవ్వాలని సీజేపీ ఇప్పటి వరకూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంత పరిహారం ఇస్తామనేది మంత్రి స్పష్టం చేయలేదు. ‘చలో పార్లమెంటు’ తదితర సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులందరిపై ఢిల్లీలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంతోపాటు సంబంధిత పత్రాలను మరో మూడు రోజుల్లో సీజేపీ ప్రతినిధులకు అందజేస్తామని నడ్డా తెలిపారు. భవిష్యత్తులోనూ ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు.
చర్చలకు ముందే ప్రధాన్ రాజీనామా
మంత్రులు, సీజేపీ ప్రతినిధుల చర్చలకు ముందే.. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి ప్రధాని మోదీకి సమర్పించారు. అనంతరం, రాజీనామాకు గల కారణాలను పేర్కొంటూ హిందీలో రాసిన ఓ పోస్ట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ప్రధాని మోదీ సూచనల మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్‌జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.
జెన్ జీ.. సమాజాన్నీ పట్టించుకుంటుంది
గత కొన్ని వారాలుగా జంతర్‌మంతర్ వద్దే ఉన్న యువ ఉద్యమకారులు.. షేక్‌హ్యాండ్లతో, ఆలింగనాలతో పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు. పలువురు తమ అనుభవాలను వివరించారు. ‘మీ తరం ఎప్పుడూ ఫోన్‌లోనే కాలం గడుపుతోంది చుట్టూ ఉన్నది ఏదీ పట్టదు అని మా అమ్మానాన్న నన్ను ఎద్దేవా చేసేవారు. అందరు అమ్మానాన్నలకు మేం చెప్పేది ఏమిటంటే.. జెన్‌జీ ఫోన్‌లో ఉండటమే కాదు.. అవసరమైతే మోదీ క్యాబినెట్‌లోని మంత్రిని కూడా పదవిలోంచి దించివేయగలదు’ అని సైనా అనే ఓ విద్యార్థిని వ్యాఖ్యానించారు. మంత్రి ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సిందని, ముందే చేసి ఉంటే సోనమ్ వాంగ్‌చుక్ 11 కిలోల బరువును కోల్పోయి ఉండేవారు కాదని, ఎంతోమంది యువతీ యువకులు రక్తం చిందించాల్సి వచ్చేది కాదని నితిన్ అనే విద్యార్థి పేర్కొన్నారు. ‘మా ఉద్యమానికి ఇది ప్రారంభ విజయం మాత్రమే. వ్యవస్థతో మా పోరాటం కొనసాగుతుంది. విద్యాశాఖ మంత్రి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరకూ అందరూ, అన్ని వ్యవస్థలూ జవాబుదారీతనంతో ఉండాల్సిందే’ అని నమ్రత అనే విద్యార్థిని వెల్లడించారు. పలువురు నిరసనకారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. నిరసన ప్రారంభమైనప్పటి నుంచీ ఇక్కడే ఉన్నానని, లాఠీచార్జి జరిగిన రోజున తనకు టియర్‌గ్యాస్ తగిలిందని, అటువంటి ఘోర దురంతాన్ని చూడటం విచారకరమని కార్తీక్ అనే విద్యార్థి వెల్లడించారు. తలకు బ్యాండేజీతో ఉన్న ఓ నిరసకారుడు.. ప్రజలు ఐక్యమైతే మార్పు సాధించగలరని నిరూపితమైందన్నారు. సీజేపీ ఉద్యమాన్ని విరమించటంతో.. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా మూసి ఉంచిన మెట్రోస్టేషన్లను తిరిగి తెరుస్తున్నామని అధికారులు ప్రకటించారు. వేలాదిగా మోహరించిన పోలీసు, పారామిలిటరీ దళాల ఉపసంహరణ మొదలైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు