చర్చా వేదికపై మంకుపట్టు
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:55 AM
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో చర్చించడానికి ప్రభుత్వం...
నడ్డా ఇంటికి రండి.. చర్చిద్దాం
ఆఫీసుకు వచ్చినా సరే
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
ఎవరీ ఇంటికీ రాబోము
జంతర్ మంతర్ లేదంటే స్వతంత్ర వేదికపైనే చర్చలు
తేల్చి చెప్పిన సీజేపీ
సరే.. మీరు కోరుకున్న చోటే చర్చిద్దామన్న జితేంద్రసింగ్
న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో చర్చించడానికి ప్రభుత్వం మరోమారు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఈ విషయంలో గురువారం ఎలాంటి ముందడుగు పడలేదు. చర్చా వేదికపై ప్రతిష్టంభన ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇంటికి రావాలని లేదా ఆయన కార్యాలయానికి వచ్చినా సరే విద్యార్థులు, సీజేపీ ప్రతినిధులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జితేంద్రసింగ్ ప్రకటించారు. ‘‘చర్చిద్దామంటూ బుధవారం మధ్యాహ్నం నుంచి నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపించాం. ఏ సమయంలో వచ్చినా, అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలకు పోవడం లేదు. చర్చల ద్వారానే పరిష్కారాన్ని సాధించగలం. దయచేసి చర్చలకు రావాలని ప్రభుత్వం తపుఫున కోరుతున్నా’’అని మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. జేపీ నడ్డా సైతం పార్లమెంటు ఆవరణలో స్పందిస్తూ.. ఉద్యమిస్తున్న యువతతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సముఖంగానే ఉందన్నారు.
తిరస్కరించిన సీజేపీ
‘‘కేంద్ర మంత్రి నడ్డా చర్చల కోసం ఆయన నివాసానికి రమ్మంటున్నారని పోలీసులు ఉదయం వచ్చి చెప్పారు. మేము ఎవరి ఇంటికీ వెళ్లేది లేదని తేల్చిచెప్పాం. ప్రజాకోర్టు ఇక్కడే ఉంది. జంతర్‌మంతర్‌కు వచ్చి చర్చించాలి. ఒకవేళ భద్రతా సమస్యలున్నాయని భావిస్తే, సమీపంలో మరో తటస్థ వేదికపై చర్చించేందుకు అయినా సమ్మతమే’’అని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్ ప్రకటించారు. శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న ఏ ఒక్కరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబోమని, కఠిన చర్యలకు దిగబోమని ప్రభుత్వం నుంచి హామీ కోరుతున్నట్టు చెప్పారు. చివరికి.. విద్యార్థులు కోరుకున్న చోట ప్రభుత్వం చర్చలకు సిద్ధమని మంత్రి జితేంద్ర సింగ్ రాత్రి ప్రకటించారు.
విద్యార్థుల పోరుకు ఎంఎం జోషి బాసట
నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థుల ఉద్యమానికి బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు మరళీమనోహర్‌జోషి బాసటగా నిలిచారు. మన విద్యావ్యవస్థపై విద్యార్థుల ఆందోళనల్లో నిజముందన్నారు. విద్యార్థుల నిరసనలను బలప్రయోగంతో అణచివేయడాన్ని తప్పుబట్టారు. అలాంటి చర్యలు వికసిత్ భారత్ లక్ష్య సాకారానికి మెజారిటీ వర్గాన్ని దూరం చేస్తాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు