ఉమ్మడి పౌర స్మృతిపై ఎన్డీయేలో భిన్నస్వరాలు!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:35 AM
ఎన్డీయే పాలనలో ఉన్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) అమలు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటనపై ఆ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాలు...
అన్ని వర్గాలతో చర్చించాకే: టీడీపీ.. బిహార్‌లో అమలు చేయం: జేడీయూ
ప్రతిపాదనలు బయటపెట్టాలి: ఎల్‌జేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే పాలనలో ఉన్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) అమలు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటనపై ఆ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాలు భిన్నాభిప్రాయం వినిపించాయి. అమిత్‌షా ప్రకటనపై తెలుగుదేశం, జనతాదళ్ (యు), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ-రాంవిలా్‌స)లు తమ వైఖరులు వెల్లడించాయి. ఇప్పటిదాకా ఈ అంశంపై తమ పార్టీలో చర్చే జరగలేదని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ‘‘యూసీసీ అమలు చేయడం అవసరమైతే పరిశీలిస్తాం. అమలు చేసే ముందు సంబంధిత వర్గాలన్నిటితో చర్చిస్తాం’’ అని ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిధితో అన్నారు. యూసీసీపై అన్ని మతాలవారిని విశ్వాసంలోకి తీసుకుని ఏకాభిప్రాయం సాధించాలని బిహార్‌లో బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన జేడీయూ పేర్కొంది. తాను హోంమంత్రి అమిత్ షాను కలుసుకుని యూసీసీపై చర్చిస్తానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా చెప్పారు. ఈ అంశంపై హడావిడిగా స్పందించాల్సిన అవసరం లేదని, బిల్లును అధ్యయనం చేసి అందులో వ్యతిరేకించాల్సిన అంశాలుంటే తమ ఆందోళనను కేంద్ర హోంమంత్రికే చెబుతామని బిహార్ ఉప ముఖ్యమంత్రి, జేడీయూ నేత విజయ్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. గతంలో పార్లమెంట్‌లో బిల్లును తాము సమర్థించినప్పటికీ... బిహార్‌లో మాత్రం దాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్యాం రజక్ తెలిపారు. కాగా... యూసీసీలో ప్రతిపాదనలేమిటో బహిరంగంగా వెల్లడించాలని, ప్రభావం చూపే వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎల్‌జేపీ (రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. దీనిపై అందరితో సమగ్రంగా చర్చించిన తర్వాతే తమ వైఖరి స్పష్టంగా ప్రకటిస్తామన్నారు. కాగా... టీడీపీ, జేడీయూ ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కొన్ని కీలక అంశాలపై స్వతంత్ర వైఖరిని అవలంబించాయని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 2019లో 370 అధికరణకు మద్దతుగా జేడీయూ ఓటు వేయలేదని తెలిపాయి. అలాగే యూసీసీపై ఎన్డీయేలోని అన్ని మిత్రపక్షాలు ఏకాభిప్రాయం ప్రకటించాల్సిన అవసరం లేదని అంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సోం, మధ్యప్రదేశ్‌లలో ఇప్పటికే యూసీసీపై చట్టాలను చేశాయి.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News