న్యాయ వ్యవస్థపై పాఠ్యాంశం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:42 AM
పుస్తక వివాదంపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. సోమవారం బహిరంగ క్షమాపణలు చెప్పింది. పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 10: జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠ్యాంశంగా చేర్చటం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ పుస్తకంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు బ్లాంకెట్ బ్యాన్ విధించిన రెండు వారాల తర్వాత ఈ వివాదంపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. సోమవారం బహిరంగ క్షమాపణలు చెప్పింది. పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో..
‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఇటీవల ఎనిమిదవ తరగతి (పార్ట్-II) కోసం 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్' అనే సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని ప్రచురించింది. అందులోని నాలుగవ అధ్యాయం 'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర' అనే అంశంపై ఉంది. ఆ అధ్యాయం విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, సభ్యులు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆ పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడం జరిగింది. అది ఇప్పుడు అందుబాటులో లేదు’ అని స్పష్టం చేసింది.
పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ పాఠ్యాంశాన్ని న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్ధమైన, లోతైన దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభివర్ణించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ భూమ్మీద ఎవరినీ అనుమతించనని తేల్చి చెప్పారు. బుక్‌పై నిషేధం విధించారు. అన్ని కాపీలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. ఆన్‌లైన్ ద్వారా పుస్తకం మొత్తం లేదా దాని భాగాలను షేర్ చేయటంపై కూడా చీఫ్ జస్టిస్ నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..